వ్యాపారుల గ్యాస్ కష్టాలు

వ్యాపారుల గ్యాస్ కష్టాలు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఇంట్లో వంట చేసుకుందామన్నా పెరుగుతున్న ధరలు చూసి పొయ్యి వెలిగించే పరిస్థితి కనబడటం లేదు. హోటల్ కి వెళ్లి తిందామన్నా రేట్లు మండిపోతున్నాయి. పెరిగిన సిలెండర్ రేట్లతో ఇబ్బంది పడుతున్నరు వ్యాపారులు. 

కమర్షియల్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. గతంలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 19 వందల 5 రూపాయలు ఉండేది. ఈ రేటు ఒకేసారి 266 కి పెంచాయి పెట్రోలియం కంపెనీలు. ప్రస్తుతం 19 కేజీల కమర్షియల్  గ్యాస్  సిలిండర్  ధర  హైదరాబాద్ లో 2 వేల 175 రూపాయలకు చేరింది. దీంతో చిరు వ్యాపారులు, స్ట్రీట్  ఫుడ్  వెండర్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మొన్నటి దాకా కోవిడ్ తో ఉపాధి కోల్పోయి వ్యాపారులకు నష్టాలే మిగిలాయి. ఇప్పుడిప్పుడే ఆదాయం వస్తోందని అనుకుంటున్న టైమ్ లో పెరిగిన గ్యాస్ ధరలు ఇబ్బంది పెడుతున్నాయి. 

సిలిండర్ల రేట్లతో హోటళ్లు, రెస్టారెంట్లలోని మెనూ ధరలు కూడా పెరగుతున్నాయి. రేట్లు హైక్ తో వ్యాపారులతో పాటు వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ రద్దీగా ఉన్న హోటల్, రెస్టారెంట్కు రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సిలిండర్లు అవసరం. దాంతో రోజుకి  వెయ్యి రూపాయల అదనపు భారం పడుతోంది. దాంతో ధరలు పెంచుదామనుకుంటే కస్టమర్లు వస్తారో లేదోనని భయపడుతున్నారు హోటళ్ళ నిర్వాహకులు. 

మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి. టిఫిన్ సెంటర్లలో వాడే పప్పులు, నూనె ధరలు పెరిగాయి. దానికితోడు ఇప్పుడు గ్యాస్సిలిండర్ల ధరలు కూడా పెంచితే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కట్టెల పొయ్యిపై వంటచేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కట్టెలు దొరకడం కష్టమవుతోంది. అప్పులు తెచ్చి మరీ టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే వడ్డీ కూడా కట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా మూసేసే ఉండటంతో బిజినెస్ పూర్తిగా దెబ్బతిన్నదని అంటున్నారు.

నిత్యావసరాలు, గ్యాస్ సిలెండర్ల ధరలు పెరగడంతో టిఫిన్, భోజనం రేట్లు కూడా 5 నుంచి 10 రూపాయల దాకా కొన్ని ఏరియాల్లో పెంచారు. అయినా తమకు గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు టిఫిన్ బండ్ల వ్యాపారులు. కమర్షియల్ గ్యాస్ బండ్ల రేట్లను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.