
AI News: ఏఐ ప్రభావం రోజురోజుకూ విస్తరిస్తోంది. టెక్కీలు తమను తాము అప్ స్కిల్లింగ్ చేసుకోకపోతే ఈ పరిణామాలు వారి ఉద్యోగ మనుగడను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దపెద్ద కంపెనీలు తమ ఏఐ స్పెండింగ్ బడ్జెట్ పెంచుతూ ఆటోమేషన్ తీసుకురావటం ద్వారా చాలా మంది ఉద్యోగులను లేఆఫ్ చేయటం స్పీడు పెంచాయి. ఇది పనిలో సమర్థతను పెంచటంతో పాటు తమకు దీర్ఘకాలంలో ఖర్చులను భారీగా తగ్గించగలవని వారు చెబుతున్నారు.
తాజాగా అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ ఒరాకిల్ తమ క్లౌడ్ విభాగంలో ఉద్యోగులను లేఆఫ్ చేస్తోంది. ఏఐపై ఖర్చులు అధికం కావటంతో కంపెనీ టెక్కీల తొలగింపులను ఎంచుకున్నట్లు వెల్లడైంది. కంపెనీ ప్రభావితమైన ఉద్యోగులకు మెయిల్ ద్వారా తమ రోల్ ఈవారం నుంచి తొలగించినట్లు సమాచారం అందిస్తోంది. అయితే ఉద్యోగుల పనితీరు ప్రమాణంగా ఈ లేఆఫ్స్ జరుగుతున్నట్లు సమాచారం. తమ వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యల్లో మార్పులు ఉంటాయని జూన్ నెలలో ఒరాకిల్ వెల్లడించిన తర్వాత తొలగింపులు కొనసాగుతున్నాయి.
Also read: -టెక్కీలకు శుభవార్త చెప్పిన Cognizant.. నవంబర్ 1 నుంచి శాలరీ హైక్స్..!
గత నెలలో ఒరాకిల్ అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఓపెన్ ఏఐ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత లేఆఫ్స్ వచ్చాయి. ఒప్పందంలో భాగంగా ఓపెన్ ఏఐ దాని స్టార్‌గేట్ చొరవలో భాగంగా ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్‌ను అద్దెకు తీసుకోవడానికి అంగీకరించింది. స్టార్‌గేట్ అనేది ఏఐ మౌలిక సదుపాయాలలో $500 బిలియన్లను పెట్టుబడి పెట్టడానికి ఒరాకిల్- సాఫ్ట్ బ్యాంగ్ గ్రూప్ వంటి భాగస్వాములతో ఓపెన్ ఏఐ మెుదలుపెట్టిన ఒక ప్రాజెక్ట్. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి పెద్ద డేటా సెంటర్‌లను నిర్మించడానికి ఒరాకిల్ ఇప్పటికీ 10 వేల బిలియన్ డాలర్ల ఖర్చు చేస్తుండటంతో లేఆఫ్స్ ద్వారా దానిని కొంత భర్తీ చేయాలని చూస్తు్న్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒరాకిల్ తీసుకొస్తున్న లేఆఫ్స్ అమెరికాతో పాటు భారతదేశంలోని ఉద్యోగులను ప్రభావితం చేయనున్నట్లు వెల్లడైంది. గత సంవత్సరం నవంబర్ నుంచి భారీగా ఒరాకిల్ ఉద్యోగులను పలు దఫాలుగా తొలగించగా ప్రస్తుతం మరోసారి ఇది కొనసాగుతోంది. దీంతో ఎంటర్ ప్రైజ్ ఇంజనీరింగ్ విభాగం, ఫ్యూజన్ ఈఆర్ పీ, డేటా సెంటర్ ఆపరేటర్లు, ఏఐ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్లు సహా ఏఐ విభాగంలో మరింత మంది ఉద్యోగ కోలతను ఎదుర్కొంటారని సమాచారం.