
- ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులతో రివ్యూలో కమిషన్ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లోని స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకోకుండా సైకాలజీ క్లాసులు నిర్వహించాలని ఎస్సీ గురుకుల సెక్రటరీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరమని, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అంతే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. బుధవారం మసాబ్ ట్యాంక్ డీసీసీ భవన్లో ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులతో కమిషన్ చైర్మన్, మెంబర్లు రివ్యూ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్సీ గురుకుల సొసైటీపై సెక్రటరీ అలుగు వర్షిణి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం జూమ్ మీటింగ్ లో రాష్టంలోని అన్ని జోనల్ అధికారులతో కమిషన్ చైర్మన్, మెంబర్లు మాట్లాడారు. ఎస్సీ గురుకులాల్లో చేపడుతున్న విప్లవాత్మక కార్యక్రమాలు ఎస్టీ , బీసీ, మైనారిటీ సొసైటీలో అమలు చేసేలా సీఎం రేవంత్ రెడ్డికి నివేదిస్తామని చైర్మన్ వెంకటయ్య తెలిపారు. మిగతా గురుకులాలకు ఎస్సీ సోసైటీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అన్ని గురుకులను రివ్యూ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారని, దీని ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తామన్నారని చైర్మన్ పేర్కొన్నారు. గురుకులాల్లో ఏర్పాటు చేస్తున్న పేరెంట్స్ కమిటీ మీటింగ్ లకు జోనల్ ఆఫీసర్లు కచ్చితంగా అటెండ్ కావాలని ఆయన ఆదేశించారు. సొసైటీలో ఉద్యోగుల నియామకాల్లో ఆర్ఓఆర్ ( రూల్ ఆఫ్ రిజర్వేషన్), మెరిట్‌ను పూర్తిగా పాటిస్తున్నామని సెక్రటరీ వివరించారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, శంకర్, రేణికుంట ప్రవీణ్, కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్ దాస పాల్గొన్నారు.