అవినీతి నిర్మూలనకు కమిషన్ పెట్టాలె : ఆకునూరి మురళి

అవినీతి నిర్మూలనకు  కమిషన్ పెట్టాలె :  ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు: అవినీతి నిర్మూలన కోసం ప్రత్యేక రాజ్యాంగ సంస్థను ఏర్పాటు చేయాలని సోషల్ డెమోక్రటిక్ ఫోరం(ఎస్డీఎఫ్) వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలన, యువతకు ఉపాధి కల్పన, జనాభా లెక్కింపు అంశాలపై శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, వేళ్లూనుకుపోయిన అవినీతి వల్లే ప్రజలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, యువతకు ఉపాధి కల్పించలేకపోతున్నామని, లక్షల మంది రైతులు నష్టపోతున్నారన్నారు. దీంతో రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్, అధికారుల అవినీతి తగ్గాలంటే రాజ్యాంగబద్ధమైన అవినీతి నిరోధక కమిషన్‌‌ను ఏర్పాటు చేయడమే మార్గమన్నారు. అవినీతికి పాల్పడితే మంత్రులైనా, ఐఏఎస్, ఐపీఎస్ అయినా బర్తరఫ్ చేసే అధికారాలను ఈ కమిషన్‌‌కు ఇవ్వాలని కోరారు.