ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు..పార్టీలు సహకరించాలి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు..పార్టీలు సహకరించాలి
  • హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు : ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కోరారు. మంగళవారం బల్దియా హెడ్డాఫీసులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో  ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ..  ఎన్నికల్లో వాడే ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకప్ పూర్తి చేసి విక్టరీ ప్లే గ్రౌండ్ లో భద్రపరిచామన్నారు.  ఈవీఎంలపై అవగాహన కోసం 397 బస్ స్టేషన్లలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని, 16 ప్రదేశాల్లో ఈవీఎం, వీవీ ప్యాట్ లపై 15,158 మందికి అవగాహన కల్పించామన్నారు.

15 మొబైల్ వ్యాన్ల  ద్వారా ఈవీఎం, వీవీ ప్యాట్​లపై హైదరాబాద్ జిల్లాలోని 15 సెగ్మెంట్లలో విసృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఓటర్ల సందేహాలు నివృత్తి చేయడానికి బల్దియా హెడ్డాఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్, 1800-599-2999 నంబర్లు 24 గంటల పాటు పనిచేస్తాయన్నారు. సీ -విజిల్ యాప్ ద్వారా మోడల్ కోడ్​లో ఉల్లంఘన జరిగిన ఫిర్యాదులను 100 నిమిషాలలోపు క్లియర్ చేసి యాప్​లో ఉంచుతామని తెలిపారు. సువిధా సెంటర్ నుంచి సింగిల్ విండో ద్వారా  పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు వాడే నాన్ కమర్షియల్, రిమోట్, అన్ కంట్రోల్ ఎయిర్ ఫోర్స్, హెలీ పాడ్స్​కు అనుమతి తీసుకోవాలన్నారు.

పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, లౌడ్ స్పీకర్లకు అనుమతి తప్పనిసరి అని రోనాల్డ్ రాస్ తెలిపారు. సిటీ సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ విస్తృత తనిఖీలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచితంగా వస్తువులు అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్, డిప్యూటీ డీఈవో అనుదీప్ దురిశెట్టి, బల్దియా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, నోడల్ అధికారులు పాల్గొన్నారు.