రీజనల్ రింగ్ రోడ్ సౌత్​ పార్ట్​పై అధికారుల కమిటీ తొలి భేటీ... భూ సేకరణపై చర్చ

రీజనల్ రింగ్ రోడ్  సౌత్​ పార్ట్​పై అధికారుల కమిటీ తొలి భేటీ... భూ సేకరణపై చర్చ

హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ అలైన్ మెంట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ సెక్రటేరియెట్​లో తొలిసారి సమావేశమైంది. ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు.

అలైన్​మెంట్ ఖరారులో పలు సమస్యలు వస్తున్నందున వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటు చేసింది. సంగారెడ్డి నుంచి మొదలై శంకర్​పల్లి, చేవెళ్ల, ఆమన్​గల్, కందుకూరు, షాద్​నగర్, ఇబ్రహీంపట్నం మీదుగా చౌటుప్పల్ వరకు మొత్తం 182 కిలో మీటర్లలో నిర్మాణం కానున్నది. సాగేతర భూముల మీదుగా సౌత్ పార్ట్ అలైన్​మెంట్ ఖరారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే, గతంలో అనుకున్న రూట్​లో కాకుండా వేరే రూట్ ఖరారు కానున్నట్లు తెలుస్తున్నది.

భూ సేకరణకు సంబంధించి పలు ప్రాంతాల్లో రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఈ నేపథ్యంలో వారి అభ్యంతరాలను కలెక్టర్లు తెలుసుకుని అధికారుల కమిటీకి అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి దాకా వచ్చిన అభ్యంతరాలను కలెక్టర్లు, స్పెషల్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది.