ప్రైవేటు కోచింగ్ సెంటర్ల  ఫీజులపై కమిటీ వేస్తం

ప్రైవేటు కోచింగ్ సెంటర్ల  ఫీజులపై కమిటీ వేస్తం

రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటం: మంత్రి సబిత
వర్సిటీల్లో కోచింగ్ క్లాసులు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల స్థితిగతులు, ఫీజులపై త్వరలోనే ఆఫీసర్లతో కమిటీ వేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో వర్సిటీల్లో పోటీపరీక్షల కోచింగ్​ను కౌన్సిల్ చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణతో కలిసి మంత్రి వర్చువల్​గా ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీచేశామని, త్వరలో మరో 80 వేల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్​ఆదేశించారని చెప్పారు. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేందుకు కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లను ఏర్పాటు చేశామన్నారు. అన్ని ఉద్యోగాల ప్రకటనలను ఒకేసారి ఇస్తే మిగతా అభ్యర్థులు పరీక్షలు రాయలేరని భావించి, విడతల వారిగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని తెలిపారు. ముందుగా పోలీస్, విద్యా, వైద్యశాఖల్లోని పోస్టులను భర్తీ అవుతాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆరు వర్సిటీల్లో పోటీ పరీక్షలకు క్వాలిటీ కోచింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. వర్సిటీ స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగానే అందించాలని వీసీలకు సూచించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని డిపార్ట్​మెంట్లవారీగా కోచింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. లైబ్రరీల్లోనూ అన్ని బుక్స్​ అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో 6 యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. వర్చువల్​లో పలువురు విద్యార్థులతో మంత్రి మాట్లాడారు.