ఉద్యోగుల పనితీరుపై స్టడీకి ఐఏఎస్​లతో కమిటీ

ఉద్యోగుల పనితీరుపై స్టడీకి ఐఏఎస్​లతో కమిటీ
  • ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై స్టడీకి ఐఏఎస్​లతో కమిటీ
  • ప్రకటించిన సీఎం కేసీఆర్
  • వీఆర్వోలు, వీఆర్ఏల సేవలపైనా సూచనలు చేయనున్న కమిటీ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై స్టడీ కోసం సీఎం కేసీఆర్​ఐఏఎస్​లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షుడిగా, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌ లోకేశ్ కుమార్, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌‌‌‌ దివ్య మెంబర్లుగా ఉంటారు. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర తదితర అంశాలను కూడా ఈ కమిటీ స్టడీ చేయనుంది. పరిపాలనా సంస్కరణల కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉద్యోగుల విభజనపై ఆదివారం ప్రగతి భవన్​లో కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్​ ప్రకారం ఉమ్మడి జిల్లాల్లో 38,643 మంది ఉద్యోగులను సర్దుబాటు చేయగా.. 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో  జాయినయ్యారని సీఎంకు ఆఫీసర్లు చెప్పారు.

101 మంది మినహా అందరూ వారికి కేటాయించిన స్థానాల్లో చేరారని వివరించారు. దీంతో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. జిల్లాల్లో ప్రభుత్వ ఆఫీసుల కాంప్లెక్స్‌‌లు, జిల్లా పోలీసు బిల్డింగ్‌‌ల నిర్మాణం పూర్తవుతున్నందున వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ‘‘ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి.. కొత్త జిల్లాలు, కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఏయే శాఖలపై ఎంత పని ఒత్తిడి ఉందో అంచనా వేయాలి. దానికి తగ్గట్టుగా కొత్త పోస్టుల అవసరాన్ని గుర్తించాలి. టెక్నాలజీ పరంగా ఏమేం చర్యలు తీసుకోవాలి.. తదితర అంశాలపై కమిటీ స్టడీ చేయాలి’’ అని ఆయన చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాల్సిన ఎడ్యుకేషన్, హెల్త్​, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా మరింత మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలోఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై సూచనలు చేయాలని కమిటీకి సీఎం ఆదేశించారు.