ధరల పెంపు తప్పదంటున్న కంపెనీలు

ధరల పెంపు తప్పదంటున్న కంపెనీలు
  • 10–15 శాతం వరకు రేట్లు పెరగొచ్చంటున్న ఇండస్ట్రీ వర్గాలు
  • రష్యా‑ఉక్రెయిన్ యుద్ధంతో  పెరిగిన ముడి సరుకుల రేట్లు
  • ఇప్పటికే పాలు, నూడిల్స్, బంగాళదుంపల రేట్లు  పెరిగాయ్‌

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: సబ్బులు, షాంపులు వంటి రోజువారి వాడే ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లు మరోసారి పెరిగేటట్టు కనిపిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్‌‌‌‌ యుద్ధంతో గోధుమ, పామ్ ఆయిల్‌‌‌‌, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి  వివిధ కమోడిటీల ధరలు పెరిగాయి. ఇలా ముడిసరుకుల రేట్లు పెరగడంతో ఈ పెరిగిన భారాన్ని కన్జూమర్లపై వేయాలని కంపెనీలు చూస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని  డాబర్, పార్లే ప్రకటించాయి. హెచ్‌‌‌‌యూఎల్‌‌‌‌, నెస్లే ఇప్పటికే కొన్ని ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లను పెంచాయని వార్తలొచ్చాయి. ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీలు కనీసం 10–15 శాతం వరకు రేట్లను పెంచుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్‌‌‌‌ఫ్లేషన్ పెరగడంతో గతంలోనూ కంపెనీలు ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లను పెంచాయి. ముడిసరుకులు రేట్లు పెరిగినా అప్పుడు కొంత వరకు మాత్రమే ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లను పెంచామని కంపెనీలు చెబుతున్నాయి. మిగిలిన భారాన్ని తామే భరించామంటున్నాయి. 
రేట్లు పెంపు తప్పదు..
ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీలు 10–15 శాతం వరకు రేట్లను పెంచుతాయని అంచనావేస్తున్నామని పార్లే ప్రొడక్ట్స్‌‌‌‌ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా పేర్కొన్నారు.   పామ్‌‌‌‌ ఆయిల్ రేటు లీటర్ రూ. 180 వరకు పెరిగిందని, ప్రస్తుతం రూ. 150 దగ్గర ఉందని ఆయన పేర్కొన్నారు. క్రూడాయిల్ రేటు బ్యారెల్ 139 డాలర్ల పెరిగి, ప్రస్తుతం 100 డాలర్ల లోపు ట్రేడవుతోందని చెప్పారు. ఇలా కమోడిటీల రేట్లలో వొలటాలిటీ ఎక్కువగా ఉందని, దీంతో కంపెనీలు  తమ ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లను ఎంత వరకు పెంచుతాయో ఇప్పుడే చెప్పలేమని వివరించారు.

అయినప్పటికీ గతంతో పోలిస్తే రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని మయాంక్‌‌‌‌ షా అన్నారు.‘కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే డిమాండ్ పుంజుకుంటోంది. దీనికి అడ్డంకిగా ఉండొద్దనే ఉద్దేశంతోనే రేట్లు పెంచడానికి కంపెనీలు ఆలోచిస్తున్నాయి. కిందటి సారి కూడా పెరిగిన ముడిసరుకుల భారాన్ని పూర్తిగా కన్జూమర్లపై వేయలేదు. ఈ సారి ముడిసరుకుల  రేట్లు బాగా పెరిగినప్పటికీ  10–15 శాతం వరకు మాత్రమే రేట్లు పెంచాలని కంపెనీలు చూస్తున్నాయి’ అని మయాంక్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దగ్గర సరిపడ ప్యాకేజింగ్ మెటీరియల్స్ స్టాక్ ఉందని, రేట్లు పెంచడంపై ఇంకో ఒకటి రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. 
రేట్లను పెంచడం స్టార్ట్ చేసిన కంపెనీలు
వరసగా రెండో ఏడాది కూడా ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఆందోళన కలిగిస్తోందని డాబర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుష్ జైన్‌‌‌‌ అన్నారు. ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఒత్తిళ్లతో రేట్లు తరచూ పెరగడం కన్జూమర్లను ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. ఖర్చు చేయడానికి కన్జూమర్లు వెనకడుగేస్తున్నారని చెప్పారు.  పరిస్థితులను గమనిస్తున్నామని, ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఒత్తిళ్లను తగ్గించడానికి కొంత వరకు రేట్లను పెంచుతామని చెప్పారు.

హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లేలు  కాఫీ, ప్యాకేజింగ్‌‌‌‌ మెటీరియల్స్‌‌‌‌ రేట్లను పెంచాయని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌ అవనీశ్​ రాయ్‌‌‌‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌–జూన్ మధ్య ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీలు 3–5 శాతం వరకు రేట్లను పెంచొచ్చని అంచనావేశారు. టీ, కాఫీ, నూడిల్స్‌‌‌‌ వంటి ఫుడ్ ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లను హెచ్‌‌‌‌యూఎల్‌‌‌‌, నెస్లే పెంచాయని రిపోర్ట్స్‌‌‌‌ వచ్చాయి. మ్యాగి రేటును 9–16 శాతం మేర  నెస్లే పెంచినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

పాలు, నూడిల్స్ రేట్లు పైకి
మిల్క్‌‌‌‌, నూడిల్స్, బంగాళదుంపలు వంటి  ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లు ఎక్కువగా పెరిగాయి.  బంగాళదుంపల రేట్లు 20–40 శాతం పెరగగా, నూడిల్స్ ధరలు 16 శాతం వరకు పెరిగాయి.  రష్యా–ఉక్రెయిన్‌‌‌‌ యుద్ధంతో సప్లయ్‌‌‌‌ చెయిన్‌‌‌‌లో అంతరాయాలు ఏర్పాడుతున్నాయి. దీంతో కొన్ని ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లు చుక్కలంటుతున్నాయి.   సోయాబిన్‌‌‌‌ రేట్లు పెరగడంతో జంతువులకు ఆహారంగా వాడే సోయామీల్ రేట్లు ఎగిశాయని యాన్మోల్‌‌‌‌ ఫీడ్స్‌‌‌‌ ఎండీ సరౌగి అన్నారు.  మొక్కజొన్న రేట్లు కూడా 10 శాతం వరకు పెరిగాయని చెప్పారు. జంతువులకు ఆహారంగా వేసే ప్రొడక్ట్‌‌‌‌ల రేట్లు 20 శాతం వరకు పెరిగాయని చెప్పారు. దీంతో చికెన్ ధరలు పెరిగాయన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరిలో వర్షాలు పడడంతో  ఆలూ పంటలు దెబ్బతిన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.

దీంతో బంగాళదుంపల సప్లయ్‌‌‌‌లో సమస్యలు తలెత్తాయని, వీటి రేట్లు పెరగడానికి ఇదే కారణమని అంటున్నారు.   నెస్లే ఇండియా ఇప్పటికే మ్యాగి, మిల్క్‌‌‌‌, కాఫీ రేట్లను 3 శాతం నుంచి 15 శాతం వరకు పెంచింది. అముల్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌తో డెయిరీ ప్రొడక్ట్‌‌‌‌లను అమ్మే జీసీఎంఎంఎఫ్‌‌‌‌తో పాటు,  మధర్ డెయిరీ కూడా  లీటర్‌‌‌‌‌‌‌‌ పాలపై రూ. 2 వరకు రేట్లను పెంచింది. పాలను సేకరించడంలో ఖర్చులు పెరిగాయని, ఫ్యూయల్ కాస్ట్‌‌‌‌, ప్యాకేజింగ్ కాస్ట్‌‌‌‌ కూడా ఎక్కువయ్యాయని ఈ కంపెనీలు చెబుతున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వలన దేశంలో ఆయిల్, గోధుమ, మొక్క జొన్న రేట్లు పెరిగాయని ఎనలిస్టులు చెబుతున్నారు.