వంటింట్లో మంట..పెరిగిన కూరగాయల ధరలు

వంటింట్లో మంట..పెరిగిన కూరగాయల ధరలు
  •     సెంచరీకి చేరువయ్యేందుకు పరుగులు 
  •     రిటైల్​ షాపుల్లో ఏ వెరైటీ అయినా కిలో రూ.100 
  •     డజన్​ కోడి గుడ్లు రూ.80, ఒక్కటైతే రూ.7
  •     వెల్లుల్లి కిలో రూ.340, పల్లీలు రూ.150 

ఖమ్మం, వెలుగు: పెరిగిన ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. ఖమ్మం రిటైల్​ మార్కెట్లో టమాటాలు తప్పించి మిగిలిన కూరగాయలన్నీ సెంచరీకి  చేరువ అవుతున్నాయి.  ఇక చిక్కుడు కాయలైతే చికెన్​ ధరతో పోటీ పడుతోంది. కోడి గుడ్ల రేట్లు కూడా భారీగా పెరిగాయి. మొన్నటి వరకు ఎగ్​ రిటైల్ రేటు రూ.6 కు అటూ ఇటూ ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.7 కు చేరింది. 

వెల్లుల్లి గడ్డలు కిలో రూ.340 ఉండగా, పల్లీల ధర కూడా రూ.150 కి చేరింది. ఉల్లిగడ్డలు కిలో రూ.50 ఉండగా, ఆలుగడ్డల ధర కూడా రూ.40 ఉంది. నగరంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్​ అండ్​ నాన్​ వెజ్​ మార్కెట్లలోనూ రేట్లు గత నెలతో పోలిస్తే 70 నుంచి 100 శాతం పెరిగాయి. ​ ఖమ్మం జిల్లాలో కూరగాయల రేట్లు పెరగడానికి ఇటీవల వచ్చిన మౌచింగ్ తుఫానే ప్రధాన కారణమని తెలుస్తోంది. 

తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో చాలా వరకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఏపీని ఆనుకొని ఉన్న జిల్లా కావడంతో ఖమ్మం మీద కూడా తుఫాను ప్రభావం కనిపించింది. జిల్లాలో కూరగాయల పంటలపై ఎఫెక్ట్ పడడంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన స్థాయిలో రాకపోవడంతో రేట్లు పెరుగుతున్నాయి. రోజూ ఉపయోగించే చిక్కుడు, బీర, దొండ, కాకర, టమాట, మిరప ఎక్కువగా ఏపీ నుంచే వస్తున్నాయి.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. 

తుఫాన్​ కు ముందు వరకు ఖమ్మం హోల్ సేల్ మార్కెట్ కు దాదాపు 60 ​ టన్నుల వరకు ఆయా కూరగాయలు వస్తుంటే, ఇప్పుడు మాత్రం అందులో దాదాపు సగం సరుకు (దాదాపు 30 టన్నులు) మాత్రమే వస్తుండడంతో ధరలపై ప్రభావం పడింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో ఏ రకం కూరగాయలు చూసినా కిలో రూ.70కి అటూ ఇటూ ఉండగా, గనుపు చిక్కుడు కాయలు మాత్రం కిలో రూ.140 ఉంది. టమాట, పచ్చిమిర్చి మాత్రమే   అందుబాటులో ఉన్నాయి. హోల్​ సేల్​ మార్కెట్ల నుంచి కూరగాయలను తెచ్చుకొని ఆయా కాలనీల్లో షాపుల్లో రిటైల్ గా అమ్ముకునే వ్యాపారులు మాత్రం ఏ రకం అయినా కిలో రూ.100 చొప్పున అమ్ముతున్నారు. 

ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, కామేపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో రైతులు ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తారు. తుఫాను కారణంగా ఆ పంటలు కూడా దెబ్బతిన్నాయి. వరుసగా వారం రోజుల పాటు ముసురుపట్టి వాన కురవడంతో ఆకుకూరలు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తర్వాత వాటిని తొలగించి మళ్లీ పంటలు వేయడంతో.. ధరలు పెరిగాయి. 

మళ్లీ పంట వేయాల్సొచ్చింది

అరెకరంలో రూ.20 వేలు ఖర్చు పెట్టి నాలుగైదు రకాల ఆకు కూరలు సాగుచేశాను. తోటకూర, బచ్చలకూర, పాలకూర, మెంతికూర, అన్నీ తుఫాను కారణంగా పాడయ్యాయి. వాటిని తొలగించాల్సి వచ్చింది. దీంతో మళ్లీ రూ.15 వేలు ఖర్చు పెట్టి రెండోసారి పంటలు వేశాను. ఇప్పుడు ఆకుకూరలకు మంచి రేటుండడం వల్ల ధర బానే గిట్టుబాటు అవుతోంది.                            - 
బోడ నాగేశ్వరరావు, కైకొండాయిగూడెం

కూరగాయల రేట్లు బాగా పెరిగాయి
 

గత నెల వరకు ఏ కూరగాయలైనా కిలో రూ.40లోపు ఉండేవి. ఇప్పుడు మాత్రం అన్నీ రూ.70 వరకు రేటు పెరిగాయి. చిక్కుడు కాయలైతే కిలో రూ.140 వరకు చెబుతున్నారు. చిక్కుడు కాయలు, చికెన్​ రేటు దాదాపు సేమ్​ ఉన్నాయి.
- శిరీష, గృహిణి, ఖమ్మం