
- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు
- నల్గొండ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం
- పార్లమెంట్లో కార్మిక స్థాయీ సంఘానికి చైర్మన్‌గా సేవలు
- సీఎం రేవంత్ రెడ్డి, సీపీఐ నేతలు, ప్రముఖుల సంతాపం
- జననం: 25-03-1942
- మరణం: 22-08-2025
హైదరాబాద్, వెలుగు: సీపీఐ అగ్ర నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(83) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని పార్టీ శ్రేణులు, నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సురవరం సుధాకర్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా, కొండ్రావుపల్లి గ్రామంలో1942 మార్చి 25న జన్మించారు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. కర్నూలులో బీఏ చదివే సమయంలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు.
అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1969లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. తర్వాత 1969లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్ కు జాతీయ అధ్యక్షుడు అయ్యారు. సుధాకర్ రెడ్డి1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పుస్తక రచనలోనూ ఆయనకు ఆసక్తి ఉంది. 'సీఐఏ', 'నిరుద్యోగం'పై పుస్తకాలను రచించారు.
రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా..
సుధాకర్ రెడ్డి మొదటిసారిగా1998లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లోనూ ఇదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా గెలిచారు. పార్లమెంటరీ వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. కార్మిక స్థాయీ సంఘానికి చైర్మన్‌గా సేవలందించారు. పార్లమెంట్ లో కీలక కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. సీపీఐ పక్షాన అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి, జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారు.
సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖుల సంతాపం
సీపీఐ అగ్ర నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుధాకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధాకర్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేత గా ఎదిగారని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు నల్గొండ ఎంపీగా గెలిచారని, ప్రజలకు అంకితభావంతో సేవ చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేసిన గొప్ప నాయకుడిని కోల్పోయామని సంతాపం తెలిపారు. కాగా, సుధాకర్ రెడ్డి మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. జీవితాంతం పీడిత వర్గాల పక్షాన కొట్లాడిన కమ్యూనిస్టు నేతగా పేరు పొందారని కొనియాడారు. సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీపీఐ సీనియర్ నేత నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం గురించి తెలిసి షాక్కు గురయ్యానని తెలిపారు. ‘‘నన్ను స్టాలిన్ బాబు సీపీఐ వైపు ఆకర్షిస్తే, సుధాకర్ రెడ్డి పార్టీలో నా ఎదుగుదలకు ప్రోత్సహించారు. ఆయన మరణం సీపీఐకి, వామపక్ష ఉద్యమానికి, ముఖ్యంగా నాకు, మా కుటుంబానికి తీరని లోటు” అని నారాయణ పేర్కొన్నారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా..
సుధాకర్ రెడ్డి ఉమ్మడి ఏపీ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో సీపీఐ 21వ మహాసభల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తెలుగు నేల నుంచి ఈ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి ఆయనే.
అంతకుముందు చండ్ర రాజేశ్వర రావును మాత్రమే ఈ పదవి వరించింది. సుధాకర్ రెడ్డి 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాయాలు సేవలందించారు. పార్టీని బలమైన శక్తిగా నిలబెట్టేందుకు కృషి చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు.