ఉప్పు ఉంటేనే వంటకు రుచి.. ఎర్రజెండా కనిపిస్తేనే సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్

ఉప్పు ఉంటేనే వంటకు రుచి.. ఎర్రజెండా కనిపిస్తేనే సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్
  • పాలనలో తప్పులు చేసినోళ్లను దించడంలో ముందుంటరు
  • భవిష్యత్తులోనూ కాంగ్రెస్ –కమ్యూనిస్ట్ సహకారం అవసరం
  • చదువు రానోళ్లు కూడా సోషల్​ మీడియా జర్నలిస్ట్​లుగా చలామణి
  • జర్నలిజం ముసుగులో అరాచకాలు  చేసేవారిని పక్కనపెట్టండి
  • సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే 
  • కొందరు పత్రికలను వాడుకుంటున్నరని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: కమ్యూనిస్టులు ఉప్పులాంటి వారని, ఎంత మంచి వంటకమైనా ఉప్పుతోనే రుచి వచ్చినట్లు..  సమస్యల పరిష్కారం కావాలంటే ఎర్రజెండా ఉండాల్సిందేనని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టుల పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. కమ్యూనిస్టులు ఎర్రజెండా పట్టుకుని పోరాటం చేస్తేనే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ‘నవ తెలంగాణ’ దినపత్రిక పదో వార్షికోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు.

  ‘‘ప్రచారం చేయడం నా చేతిలో లేదు. మీరు చేసే కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించడం సీఎంగా నా చేతిలో ఉంది. పెట్టుబడులు ఉన్న వ్యాపార సంస్థలు వారి ప్రయోజనాల కోసం ప్రచారం చేసుకుంటాయి. కానీ, నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తాను. ఏ వంటకంలోనైనా ఎన్ని మసాలాలు వేసినా, ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగే, ప్రజా సమస్యలపై ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది. కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి పనికొస్తారో లేదో నేను విశ్లేషించలేను కానీ, ఉన్నవాళ్లను దించడానికి మాత్రం వందకు వంద శాతం పనికొస్తారు. తప్పులు చేసేవారిని దించడానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే తప్పులు జరగకుండా పాలన అందించాలని నేను ఎప్పుడూ అనుకుంటాను” అని వ్యాఖ్యానించారు. 

అబద్ధాలు చెప్పొద్దని నిర్ణయించుకున్నా..

అబద్ధాల పునాదులపై రాజకీయ భవిష్యత్తు నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పకూడదని నిర్ణయించుకున్నా. నా ఏ ఉపన్యాసం లేదా విశ్లేషణ అయినా రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని ఇప్పటివరకూ ఎవరూ విశ్లేషించలేదు. నిజం కొన్నిసార్లు ఇబ్బంది కలిగించినా, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను” అని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే అని, నిజాలుగా భ్రమలు కల్పించగల నేత అని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు కమ్యూనిస్టుల పట్ల అపారమైన గౌరవం ఉందని సీఎం రేవంత్​ తెలిపారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచినప్పుడు తన పార్లమెంటు కార్యాలయాన్ని మల్లు స్వరాజ్యంగారితో ప్రారంభించుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.  

జర్నలిస్టులు లక్ష్మణరేఖ గీసుకోవాలి 

రాజకీయ పార్టీల యాజమాన్యంలో నడుస్తున్న పత్రి కలు, ప్రసార మాధ్యమాల కారణంగా జర్నలిజం విశ్వసనీయత వేగంగా పడిపోతున్నదని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. గతంలో సిద్ధాంతాల వ్యాప్తి కోసం పత్రికలు స్థాపించేవారని.. కానీ ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన ఆస్తులను కాపాడు కోవడానికి పత్రికలను వాడుకుంటున్నాయని తెలిపారు. ఈ ధోరణి వల్ల నిజమైన జర్నలిస్టుల విశ్వసనీయత దెబ్బతింటున్నదని పేర్కొన్నారు. 

‘‘జర్నలిజం ముసుగులో అరాచకాలు చేసేవారిని నిజమైన జర్నలిస్టులు పక్కకు నెట్టాలి. లేకపోతే ఇది తెలంగాణ సమాజానికే కాదు, దేశ భద్రతకు కూడా ప్రమాదకరం” అని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ లో కొందరిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టులకు, రాజకీయ పార్టీ కార్యకర్తలకు మధ్య తేడా తెలియని పరిస్థితి ఏర్పడిందని, మీడియా సమావేశాల్లో అడిగే ప్రశ్నల తీరును బట్టి వారు జర్నలిస్టులా? రాజకీయ పార్టీల కార్యకర్తలా? అని గుర్తించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. 

దీనిపై జర్నలిస్టులు విశ్లేషించుకొని, ఒక లక్ష్మణరేఖ గీసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. సీనియర్, నిబద్ధత కలిగిన జర్నలిస్టులు రాసే విశ్లేషణాత్మక కథనాలు ప్రభుత్వానికి ఎంతో ఉపయోగ పడతాయని తెలిపారు.  నిజమైన జర్నలిస్టులు నిర్వహించే సెమినార్ల ద్వారా ‘జర్నలిస్ట్’ అనే పదానికి ఒక నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఎవరికి వారు ‘జర్నలిస్ట్’ అని పేరు పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు . వారికి కనీస అక్షర జ్ఞానం కూడా ఉండదని, జర్నలిజం స్కూళ్లకు వెళ్లిన వారూ కారన్నారు. 

 ‘‘గతంలో సీనియర్ జర్నలిస్టులకు జూనియర్లు ఎంతో గౌరవం ఇచ్చేవారు. జర్నలిజానికి తమ జీవితాన్ని అంకితం చేసిన సీనియర్లకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు వేంనరేందర్​ రెడ్డి, సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, జాతీయ కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తులోనూ కాంగ్రెస్ - కమ్యూనిస్ట్ సహకారం అవసరం

భవిష్యత్తులోనూ కాంగ్రెస్ –కమ్యూనిస్ట్ సహకారం అవసరం అని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. ‘‘రాజకీయాల్లో కొన్నిసార్లు కలిసి పనిచేస్తాం.. కొన్నిసార్లు విడిపోతాం. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ అంతకుముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలే ఎక్కువగా ఉపయోగపడ్డాయి. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దానికి విద్యుత్ ఉద్యమాలు కారణం. 2023లో మేం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కమ్యూనిస్టులు చేసిన పాదయాత్రలు, పోరాటాలు ఉపయోగపడ్డాయి. 

దున్నేవాడికి భూమి అనే కమ్యూనిస్టు నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ అసైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పట్టాలతో ప్రజలకు చేరువ చేసింది. పేదవాడికి ఇల్లు, బుక్కెడు బువ్వ పెట్టాలనే కమ్యూనిస్టు ఆలోచనను కాంగ్రెస్ పార్టీ ఆచరణలో పెట్టింది. సమస్యల ప్రాతిపదికన ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనండి. చెడును చెవులో చెప్పండి. నవ తెలంగాణలో రాసినా కూడా మాకు చేరుతుంది. మీరు రాసిన విషయాలను తప్పకుండా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. మనం కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది”అని పేర్కొన్నారు.