లోకల్​ ఏరియాల అభివృద్ధి కోసం సీఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టట్లే..

లోకల్​ ఏరియాల అభివృద్ధి కోసం సీఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టట్లే..

సంగారెడ్డి, వెలుగు:  సంగారెడ్డి జిల్లాలో దాదాపు 4 వేల పైచిలుకు భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు పాశంమైలారం, ఐడీఏ బొల్లారం, గుమ్మడిదల, హత్నూర, సదాశివపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ఫ్యాక్టరీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పని చేస్తున్నాయి. ప్రభావిత గ్రామాల్లో మలౌక వసతుల కల్పన కోసం సామాజిక బాధ్యతగా వారు అర్జిస్తున్న లాభాల్లో 2శాతం ఖర్చు చేయాలని చట్టం చెబుతోంది. కానీ ఆయా ఫ్యాక్టరీల ఓనర్లు ఆదిశగా డబ్బులు ఖర్చు చేయకపోగా.. చేసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీని వేసి పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టింది. కమిటీలో చైర్మన్ గా మంత్రి హరీశ్​రావు, కో-చైర్మన్ గా జిల్లా కలెక్టర్ శరత్, కన్వీనర్, కో-కన్వీనర్లుగా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, సీపీఓ మనోహర్ వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల శాఖ ఆఫీసర్లు మొత్తం 19 మంది సభ్యులుగా ఉంటారు. 

కనీస బాధ్యత మరిచిన్రు.. 

జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీల్లో చాలావరకు ఫ్యాక్టరీలు రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేయించిన భూముల్లోనే కొనసాగుతున్నాయి. కానీ భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పించాలనే కనీస బాధ్యత మరిచాయి.  బాధితులు దిక్కులేక అవే పరిశ్రమల్లో రోజువారి కూలీలుగా పని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దానికి తోడు పరిశ్రమలు వదిలే పొల్యూషన్ కారణంగా స్థానికంగా వేలాది వ్యవసాయ భూములు బీడువారాయి. భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. డెవలప్​మెంట్ లేక అనేక గ్రామాలు, పట్టణాలు వెనకబడిపోయాయి. నిరుద్యోగ సమస్యతో యువత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫ్యాక్టరీల ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలు అట్టకెక్కాయి. పరిస్థితి ఇలా ఉంటే కంపెనీల ఓనర్లు మాత్రం ఖర్చు చేయని ఫండ్స్​ను చేసినట్లు తప్పుడు లెక్కలతో జిల్లా యంత్రాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ధోరణి మార్చుకొని ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతుల కోసం కృషి చేయాలని కోరుతున్నారు. 

ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. 

ఫ్యాక్టరీల ఓనర్స్​ తీరుపై  అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు ప్లాన్ చేసింది. నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సిన సీఎస్ఆర్ ఫండ్స్ వివరాలు ఇవ్వాలని పరిశ్రమల శాఖను జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశించారు. కమిటీ సభ్యులు పరిశ్రమలను సందర్శించి సీఎస్ఆర్ ఫండ్స్ ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత రావాల్సి ఉంది? అనేదానిపై ఆరా తీస్తున్నారు. ఫ్యాక్టరీల లాభాల్లో వచ్చే 2శాతం వాటాను ఇక నుంచి కలెక్టర్ పేరు మీద ప్రత్యేక అకౌంట్ ఓపెన్​ చేసి అందులో జమ చేయనున్నారు. ఆ అకౌంట్​ నుంచి వాటిని స్థానిక అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. 

ఫండ్స్ ఖర్చుచేసేందుకు చర్యలు 

ఫ్యాక్టరీల లాభాల్లో వచ్చే 2 శాతం వాటాను సక్రమంగా వినియోగించేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేశాం. ఆయా సీఎస్ఆర్ ఫండ్స్ ను స్థానిక డెవలప్​మెంట్ కోసం ఖర్చు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. 

- సీపీఓ మనోహర్, కమిటీ కో కన్వీనర్