
భారతదేశంలో క్రెడిట్ కార్డుల వాడకం రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. లగ్జరీ ఖర్చుల కోసం పిల్లల స్కూల్ ఫీజుల చెల్లింపుల కోసం ఇలా ప్రతిదానికీ ప్రజలు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడటంతో వారికి తెలియకుండానే మధ్యతరగతి పెద్ద అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. దీనిపై ఇప్పటికే చాలా మంది నిపుణులు కామెంట్ చేయటంతో పాటు పలు నివేదికలు కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాధ్యతాయుతంగా జరగటం లేదని, విచ్చలవిడి వినియోగం పెరిగిందని స్పెండింగ్ ట్రెండ్ చూసిన నిపుణులు అంటున్నారు.
భారతదేశంలోని క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తున్న బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫిన్ టెక్ కంపెనీలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. గతంలో మాదిరిగా కార్డుల జారీలో స్పీడును తగ్గించాయి. ప్రజలు ఆన్ లైన్లో ఎక్కువ విలువ కలిగిన ఆర్డర్లు, షాపింగ్స్ రోజురోజుకూ పెరిగిపోవటంతో రక్షణాత్మక చర్యల్లో భాగంగా కార్డుల జారీ తగ్గించినట్లు ఇన్ క్రెడ్ ఈక్విటీస్ రిపోర్ట్ వెల్లడించింది. దీనికి తోడు కార్డులు ఖాళీ చేసిన తర్వాత బిల్లులు కట్టకుండా ఎగ్గొడుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోవటంతో సంస్థలు అప్రమత్తంగా ముందుకు సాగుతున్నాయని బ్రోకరేజ్ వెల్లడించింది.
ఈ పరిస్థితుల్లో 2025 జూలైలో నెల ప్రాతిపధికన క్రెడిట్ కార్డుల సంఖ్య కేవలం 0.4 శాతం మాత్రమే పెరిగింది. దీంతో దేశంలో కోటి 12 లక్షల కార్డులు ప్రస్తుతం ఉన్నాయి. ప్రధానంగా జూలైలో హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ కొత్త కార్డుల జారీలో స్పీడును కొనసాగించగా.. ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఇండస్ఇండ్, కోటక్ మహీంద్రా మాత్రం ఆచితూచి వ్యవహరించాయి. జూలై ఒక్క నెలలోనే దేశంలోని క్రెడిట్ కార్డు యూజర్లు లక్ష 90వేల కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. ప్రధానంగా ఆన్ లైన్ చెల్లింపులు ఇందులో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ALSO READ : మోడీ సర్కార్ కీలక నిర్ణయం..
ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున ఒక్కో కార్డ్ యూజర్ వినియోగం కార్డుకు అత్యధికంగా జూలైలో రూ.17వేల 400కి చేరుకుందని తేలింది. అలాగే ఫెస్టివ్ షాపింగ్, డిస్కౌంట్ ఆఫర్ల కారణంగా ఆగస్టులో కూడా సగటు వినియోగం మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కంపెనీలు ఎక్కువగా క్రెడిట్ వర్థీ కలిగిన మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కొత్త కస్టమర్ల కోసం వేట కొనసాగిస్తున్నాయి. తమ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ ఉన్నప్పటికీ అప్రమత్తత కూడా అవసరమని ప్రస్తుత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ కంపెనీలు భావిస్తున్నాయి.