నీళ్లు లేవ్​.. ఇంటి కాడ్నే పనిచేయండి!

నీళ్లు లేవ్​.. ఇంటి కాడ్నే పనిచేయండి!

ఉద్యోగులకు చెన్నై ఐటీ కంపెనీల ఆర్డర్​
12 కంపెనీల్లోని 5 వేల మందికి ఆదేశాలు

ఇంటి దగ్గర్నుంచే పనిచేస్తే ఎంత బాగుంటుంది? బయటకు అనకపోయినా చాలా మంది ఉద్యోగులు మనసులో అనుకునే మాట మాత్రం ఇదే. ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీలు, కొందరికి ఆ చాన్స్​ కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు చెన్నైలోని చాలా ఐటీ కంపెనీలూ ఉద్యోగులకు ఈ బంపర్​ ఆఫర్​ ఇచ్చాయి. కారణం.. నీళ్లు! అదెలా కారణమంటారా..  కరువు అట్లుంది మరి. ఎండాకాలంలో నీళ్లు దొరకడం గగనమైపోతోంది. చాలా ఐటీ కంపెనీలకు నీళ్లు రావట్లేదు. దీంతో‘‘బాబ్బాబూ.. ఆఫీసులో నీళ్లు రావట్లేదు. ఇంటి దగ్గర్నుంచే పని చేసి పెట్టండి” అంటూ ఉద్యోగులను కంపెనీలు కోరాయి. ఓల్డ్​ మహాబలిపురం రోడ్​ (ఓఎంఆర్​)లోని 12 కంపెనీలు దాదాపు 5 వేల మంది ఉద్యోగులకు ఈ ఆర్డర్లు వేశాయని ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు చెబుతున్నారు.

‘‘నాలుగేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. అయితే, ప్రైవేట్​ ట్యాంకర్లు నీళ్లు సప్లై చేయకుండా ధర్నాకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు నీటి సమస్యతో ఉద్యోగులను ఇంటి దగ్గర్నే పనిచేయాల్సిందిగా కంపెనీలు ఆదేశించాయి” అని ఓ వ్యక్తి చెప్పారు. ఓఎంఆర్​లో దాదాపు 600 ఐటీ, ఐటీఈఎస్​ కంపెనీలున్నాయి. నీటిని పొదుపుగా వాడేందుకు కొన్ని కంపెనీలు ఉద్యోగులకు నిబంధనలు పెట్టాయి. ఉదాహరణకు షోలింగనల్లూర్​లోని ఫోర్డ్​ బిజినెస్​ సర్వీసెస్​.. ఉద్యోగులే తాగునీరు తెచ్చుకునేలా నిబంధన పెట్టింది. అలాగే చాలా కంపెనీలూ చేస్తున్నాయి. చాలా కంపెనీలు 55 శాతం నీటి అవసరాలను ట్రీట్​ చేసిన నీటితోనే తీర్చుకుంటున్నాయని గ్రీన్విరాన్​మెంట్​ అనే నీటి నిర్వహణ కంపెనీ సీఈవో, కోఫౌండ్​ వరుణ్​ శ్రీధరన్​ చెప్పారు.

ప్రస్తుతం నగరంలో మురుగు నీటి శుద్ధిపై బాగా దృష్టి పెట్టారన్నారు. నీళ్లు లేక అతి కష్టమ్మీద పనిచేస్తున్నామని ఓ ఐటీ కంపెనీ అడ్మిన్​ మేనేజర్​ చెప్పారు. ఇంకా ఎంత కాలం ఈ కష్టాలుంటాయోనని ఆవేదన చెందారు. ఆస్తి పన్నుల్లో 30 శాతం నీళ్లు, మురుగు శుద్ధి కోసమే చెల్లిస్తున్నా ఫలితం రావట్లేదన్నారు. ప్రతి వేసవిలో ఓఎంఆర్​కు రోజూ 3.2 కోట్ల లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. అందులోనూ 60 శాతం నీళ్లు ఐటీ కంపెనీలే వాడుకుంటాయి. ఇప్పుడు నీటి కరువు రావడంతో చెన్నై అధికారులకు నీళ్లు వచ్చేలా చూడాల్సిందిగా విన్నపం పెట్టుకున్నారు. కానీ, వాళ్లూ చేతులెత్తేశారు. సిప్కాట్​ ఐటీ పార్క్​లో 46 కంపెనీలున్నాయి. వాటికి రోజూ 20 లక్షల లీటర్ల నీళ్లు అవసరం. ఆ అవసరాలు తీర్చుకునేందుకు 17 బావులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి నుంచీ 10 లక్షల లీటర్లకు మించి రావడం లేదు.