
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
సింగరేణి కార్మికుల్లో నిరాశ
మందమర్రి,వెలుగు: లాక్డౌన్ కారణంగా సింగరేణిలో ఆగిపోయిన కారుణ్య నియామకాల ప్రక్రియ మళ్లీ మొదలుపెడుతామని, రిటైర్మెంట్ రోజే కార్మికులకు అన్ని రకాల బెన్ఫిట్స్ అందజేస్తామని అసెంబ్లీ వేదికగా సోమవారం సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా లాభాల్లో వాటా విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఇక కార్మికులకు సొంతింటి పథకం, కార్పొరేట్ వైద్య సౌకర్యం, మార్చి నెలలో కోతపెట్టిన సగం వేతనం చెల్లింపు లాంటి సమస్యల ముచ్చటే తీయకపోవడంపై కార్మికులు నిరాశచెందారు.
కారుణ్యానికి ఓకే..
లాక్డౌన్విధించకముందు చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో మెడికల్ బోర్డు జరిగింది. 2018 ఏప్రిల్‌లో ప్రారంభమైన బోర్డు ప్రతి నెల నిర్వహిస్తూ వచ్చారు. 60 మెడికల్ బోర్డులకు 10,713 మంది దరఖాస్తు చేసుకోగా 6,316 మంది అన్‌ఫిట్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్‌తో మార్చి 13 తర్వాత అదే నెలలో జరగాల్సిన మరో బోర్డు సమావేశం వాయిదా పడగా, ఇప్పటి వరకు జరగలేదు. సీఎం ప్రకటనతో త్వరలో మెడికల్‌బోర్డు మొదలయ్యే చాన్స్ ఉంది. సాధారణంగా కార్మికులు రిటైర్డు అయితే సీఎంపీఎఫ్తో పాటు గ్రాట్యూటీ, పింఛను, ఎఫ్బీఎస్ తదితర ఆర్థిక బెనిఫిట్స్అందించే ఆనవాయితీ ఉండేది. రెండేళ్లుగా 12వేల మంది కార్మికులు బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. రిటైర్మెంట్ రోజే ఆర్థిక ప్రయోజనాలు అందెంచేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించడం ఊరట కలిగించింది.
లాభాల్లో కార్మికుల వాటాపై ప్రకటన ఏదీ?
కార్మికుల కష్టార్జితంతో సింగరేణి సంస్థ ఏటా వేల కోట్ల లాభాలు ఆర్జిస్తోంది.2019-–20 ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు కాలం గడుస్తున్న ఇప్పటి వరకు కంపెనీ లాభాలు, కార్మికుల వాటాను ప్రకటించలేదు. సోమవారం సీఎం కేసీఆర్ ప్రస్తావనలో ఎక్కడ లాభాలు, వాటా విషయం రాలేదు. లాభాల్లో కార్మికుల వాటా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కంపెనీ సాధించిన లాభాల వివరాలను ప్రభుత్వానికి అందజేసిన తర్వాత వాటా ప్రకటన వెలువడుతుంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసి సుమారు ఆరు నెలలు కావస్తున్నప్పటికీ సింగరేణి అధికారికంగా లాభాలు ప్రకటించలేదు. దీంతో కార్మికుల వాటా ఊసేలేకుండా పోయింది.
గతంలో ఇచ్చిన హామీల అమలెక్కడ?
2017 జనవరిలో అసెంబ్లీ వేదికగా కొత్త భూగర్భగనుల ఏర్పాటు, ఉద్యోగాలకు కార్మికుల వారసుల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ వన్‌టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు కల్పించడం, మారు పేర్ల సవరణ హామీలను స్వయంగా సీఎం ఇచ్చినా ఇప్పటి వరకు అమలులోకి రాలేదు. వీటితో పాటు సొంతింటి పథకం, రెండు వందల గజాల ఇంటిస్థలం కేటాయింపు, రిటైర్డు కార్మికుల పింఛను పెంపుదల బకాయిలు, కార్పొరేట్ వైద్య సౌకర్యం ఇప్పటికీ అమలుచేయలేదు. మార్చి నెల కోత విధించిన సగం వేతనం చెల్లింపు వంటి సమస్యలనూ సీఎం ప్రస్తావించలేదు. సుమారు రూ.150కోట్ల వేతనాల కోసం కార్మికులు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు.
For More News..