పరిహారం పైసలిస్తే ఖర్చు చేసేస్తరు : ఇంద్రకరణ్‍రెడ్డి

పరిహారం పైసలిస్తే ఖర్చు చేసేస్తరు : ఇంద్రకరణ్‍రెడ్డి

భూ నిర్వాసితులపై మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి వ్యాఖ్యలు

నిర్మల్‍, వెలుగు: నష్ట పరిహారం డబ్బులు ఇస్తే రైతులు ఖర్చు చేస్తారంటూ రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం కార్యదర్శి స్మితసబర్వాల్‍తో కలిసి మామడ మండలం పోన్కల్‍ వద్ద నిర్మిస్తున్న సదర్మట్​బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు అక్కడకు రావడంతో మంత్రి వారితో మాట్లాడారు. విలువైన భూములు కోల్పోయామని, పైగా పరిహారానికి దూరమవుతున్నామని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నష్ట పరిహారం చెల్లిస్తే అప్పులు తీర్చుకునేవారిమని వాపోయారు. దాంతో ఇంద్రకరణ్​రెడ్డి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయని, ఇంతకుముందే ఇచ్చి ఉంటే ఈపాటికి ఖర్చయిపోయేవని, అందుకే ఇవ్వలేదని అన్నారు. త్వరలో ఇస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి వస్తే కాస్తయిన న్యాయం జరుగుతుందేమోనన్న ఆశతో వచ్చామని, కానీ ఏం చెప్పకుండానే వెళ్లిపోయారని ఈ సందర్భంగా పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమి పైసలు మాకే ఇవ్వడం లేదని మహిళ రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంట్లో పిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని కొందరంటే.. అప్పుల చేసినవారు ఇండ్లమీదకొస్తున్నారంటూ మరికొంత మంది రైతులు వారి బాధను వెళ్లగక్కారు.