
- మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పరిహారం పేచీలు
- ఒకే విస్తీర్ణంలోని ఇండ్లకువేరు వేరుగా…
- గట్టిగా దబాయిస్తే మారుతున్న పరిహారం లెక్కలు
తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో సవుట కనకవ్వకు 250 గజాల్లో ఇల్లుంది. పరిహారంలో భాగంగా ఆమెకు ఉన్న 159 గజాల్లోని ఇంటికి సంబంధించి రూ.10 లక్షల చెక్కు ను అందజేశారు. మిగిలిన 140 గజాల ఖాళీ స్థలానికి పరిహారమే ఇవ్వలేదు. ఖాళీ స్థలం గురించి అడిగితే సమాధానం చెప్పే ఆఫీసర్లే కరువయ్యారని ఎవరికి చెప్పాలో తెలియడం లేదని కనకవ్వ వాపోతోంది.
తొగుట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి యాదయ్యకు 250 గజాల్లోని ఇల్లు, ఖాళీ స్థలానికి మొదట ఆఫీసర్లు రూ.12.70 లక్షల చెక్కు ఇచ్చారు. తర్వాత ఎక్కువ డబ్బులు వచ్చాయంటూ ఆ చెక్కు వెనక్కి తీసుకొని.. రూ. 8.60 లక్షల చెక్కు అందజేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఒక ఫిర్యాదు పత్రం అందజేయమని ఆఫీసర్లు సూచించారు. ఇదే గ్రామంలో మరో ఇంటికి రూ.16 లక్షల పరిహారం అందజేశారు.
తొగుట మండలం రాంపూర్ నివాసి అప్పనపల్లి నర్సయ్యకు గ్రామంలో 120 గజాల్లో ఇల్లుంది. అయితే ఇంటికి సంబంధించి కేవలం రూ. 95 వేల చెక్కును మాత్రమే అందజేశారు. ఇంత తక్కువ పరిహారం తనకు వద్దని నర్సయ్య చెక్కును తీసుకోలేదు. ఇప్పటి వరకు మూడుసార్లు ఇళ్ల సర్వే నిర్వహించినా నర్సయ్యకు మాత్రం పరిహారం అందించలేదు.
ఇవీ కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని పరిహారపు వెతలు. పరిహారం విషయంలో ఆఫీసర్లు ఇల్లుకో విధంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టారీతిగా సర్వేలు నిర్వహించారు. నిర్వాసితులను అయోమయానికి గురి చేస్తున్నారు. నిలదీసిన కొందరికి ఒకటి రెండు రోజుల్లో పరిహారాన్ని పెంచి చెక్కులిచ్చిన ఆఫీసర్లు.. మరికొందరికి మాత్రం తగ్గించి ఇచ్చారు. ఒకే రకమైన ఇళ్లకు ఒక ఊళ్లో ఒకవిధంగా పరిహారమిస్తే.. పక్క ఊళ్లో మరో విధంగా అందజేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే అవకాశం లేకుండా పోలీసుల పహారాలో ఆఫీసర్లు గ్రామాల్లోకి వస్తున్న పరిస్థితి.
వ్యవసాయ భూమి, ఖాళీ స్థలం, ఇంటికి వేర్వేరుగా పరిహారాలు చెల్లించాల్సి ఉన్నా.. ఆఫీసర్లు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. తోచినంతగా చెక్కులు పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. వాస్తవానికి ఇళ్ల పరిహారంలో గజం భూమికి రూ.1600 చొప్పున చెల్లించాలి. ఇంటికి సంబంధించి స్లాబ్, గూన, రేకులు, గుడిసెలుగా విభజించి ఎంత విస్తీర్ణంలో ఉందో లెక్కకట్టాలి. ఆ విధంగా వేర్వేరుగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఒకే ఊరిలో బోరు బావులు, చేద బావులకు కూడా పరిహారం వేర్వేరుగా ఉండటం గమనార్హం. ఒక ఇంట్లో చేదబావికి రూ.28వేలు చెల్లిస్తే.. పక్కింట్లోనే మరో చేద బావికి కేవలం రూ.20 వేలు ఇవ్వడం గమనార్హం. ఇదేంటని ప్రశ్నిస్తే జవాబు దొరకని దుస్థితి. సిద్దిపేట డివిజన్ పరిధిలోని ఎనిమిది గ్రామాలు మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం గ్రామానికో ఆర్డీఓను నియమించింది. దీంతో ఏ గ్రామంలో ఏ ఆర్డీఓ పరిహారం చెల్లిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పరిహారాలకు సంబంధించి చెల్లింపులు ఎలా చేస్తున్నారో తెలపాలని కోరినా ఆఫీసర్లు స్పందించడం లేదని నిర్వాసితులు చెబుతున్నారు. వాస్తవానికి ఇళ్ల పరిహారాలకు సంబంధించి నిర్వాసితులకు ముందస్తుగా పూర్తి వివరాలను అందించి వారికి ఏ కేటగిరి ప్రకారం పరిహారం ఇస్తున్నారో చెప్పాల్సి ఉన్నా.. దీన్ని ఎవరూ పాటించడం లేదు. గ్రామానికో ఆర్డీఓను నియమించినా క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది వ్యవహార శైలి పట్ల ముంపు గ్రామాల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తొగుట మండలంలోని ఒక ముంపు గ్రామానికి చెందిన సర్పంచ్సర్వే అధికారుల చేతులకు మొక్కాలని చెబుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.
పోలీసుల నిఘాలో..
ముంపు గ్రామాల్లోని ప్రతి కూడలిలో పోలీసు బృందాలు పహారా కాస్తున్నాయి. ఏకంగా ఆయుధాలతో పోలీసులు రోజంతా ఆయా గ్రామాల్లో పహారా కాస్తున్నారు. పరిహారాల్లో అసమానతలపై ప్రశ్నిస్తే పోలీసుల నుంచి వేధింపులు తప్పవని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. గంట గంటకో పోలీసు వాహనం గ్రామాల్లో తిరుగుతోంది. దీనికి తోడు గ్రామంలోకి ఎవరొస్తున్నారు.. ఎవరు పోతున్నారో ప్రతి విషయాన్ని పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళుతున్నారు.
వీడని ‘చెక్కు’ముడులు
చెక్కులు మాయమైన విషయంపై జిల్లా ఆఫీసర్లు స్పందిస్తున్న తీరు అంతు చిక్కకుండా ఉంది. రెండు చెక్కులు మాయం కావడం, అందులో ఒక చెక్కుకు సంబంధించిన రూ.50 లక్షల సొమ్మును డ్రా చేసుకున్నా.. ఉన్నతస్థాయి ఆఫీసర్లకు జిల్లా యంత్రాంగం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బ్యాంకు నుంచి రూ.50 లక్షల డబ్బులు డ్రా చేసిన చాంద్‌పాషా ఆ సొమ్ముతో ఆస్తుల కొనుగోళ్లు జరిపినట్టు గుర్తించారు. చాంద్‌పాషా కుటుంబ సభ్యులను కలెక్టరేట్‌కు పిలిపించుకొని ఆస్తుల వివరాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. అలాగే చెక్కుల మాయం కేసులో రెవెన్యూ ఆఫీసర్ల హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. కేసులో ప్రధాన నిందితుడైన సందీప్‌తో కొందరు ఆఫీసర్లు టూర్‌కు వెళ్లినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆఫీసర్లు, సిబ్బంది కుమ్మక్కై నిర్వాసితులకు చెల్లించాల్సిన సొమ్మును స్వాహా చేసేందుకు యత్నించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.