V6 News

హైదరాబాద్​లోని అన్ని సెగ్మెంట్లలో పోటీచేస్తం: విశారదన్ మహరాజ్

హైదరాబాద్​లోని అన్ని సెగ్మెంట్లలో పోటీచేస్తం: విశారదన్ మహరాజ్
  • ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్
  • 90 శాతం బహుజనులను పది శాతం అగ్రవర్ణాలు ఏలుతున్నాయి
  • బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం తేవడమే లక్ష్యమని వెల్లడి
  • చంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, మేడ్చల్​కు అభ్యర్థుల ప్రకటన

ఎల్బీ నగర్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి హైదరాబాద్​లోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ధర్మ సమాజ్  పార్టీ రాష్ట్ర (డీఎస్పీ) అధ్యక్షుడు డాక్టర్  విశారదన్  మహరాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్​లో కొత్తపేటలోని బాబు జగ్జీవన్ భవన్ లో జరిగిన హైదరాబాద్–మేడ్చల్–రంగారెడ్డి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గానికి డీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్దుల్  రెహమాన్ ను, రాజేంద్రనగర్  అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవేంద్ర ముదిరాజ్, మేడ్చల్  అభ్యర్థిగా రాజ్ కమల్ ను విశారదన్  ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ ముగ్గురిని రూ.వేల కోట్ల ధనం ఉన్న అగ్రకుల అభ్యర్థులతో ఢీకొట్టించి, గెలుపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

‘‘హైదరాబాద్ మహానగరంలో కోటి మంది ప్రజలున్నారు. వారి 93 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే. వారిలో చాలా మంది పేదలు. 93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను పదిశాతం లేని అగ్రకులాలు వారు ఏలుతున్నారు. హైదరాబాద్ కు 30, 40 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి కటిక పేదలు వలసవచ్చి సంపద సృష్టించారు. కానీ, వారు మాత్రం పేదలుగానే ఉండిపోయారు. ఉండడానికి కనీసం గూడు కూడా లేదు. వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు” అని విశారదన్  వ్యాఖ్యానించారు.

హైదరాబాద్  మహానగరాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ  రక్తమాంసాలతో కట్టారని, వాళ్లకు అధికారం కట్టబెట్టెందుకే ధర్మ సమాజ్  పార్టీ ఆవిర్భవించిందని ఆయన అన్నారు. ఈ ఆవిర్భావ సభలో హైకోర్టు అడ్వొకేట్ వరిస్వామి కురుమ, తెలంగాణ సామాజిక చైత్యన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుపతయ్య వంశరాజ్, - మేడ్చల్  జిల్లా రిటైర్డ్  డీఎస్పీ విజయ్ కుమార్, ధర్మ సమాజ్  పార్టీ రాష్ట్ర కార్యదర్శి రహమాన్  తదితరులు పాల్గొన్నారు.