మెదక్​ సీటు కోసం బీఆర్ఎస్​లో పోటాపోటీ

మెదక్​ సీటు కోసం బీఆర్ఎస్​లో పోటాపోటీ
  •  ఈ ఒక్క ఎంపీ సెగ్మెంట్​లోనే పార్టీకి గెలుపు అవకాశాలు! 
  •     టికెట్​ రేసులో ఎక్కువ మంది లీడర్లు  
  •     తెరపైకి ఎమ్మెల్సీ కవిత పేరు 
  •     ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి వైపు  కేసీఆర్​ మొగ్గు 

మెదక్, వెలుగు :  మెదక్ ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్​లో తీవ్ర పోటీ కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లను, ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి రాష్ట్రంలో ఈ ఒక్క లోక్​సభ​సెగ్మెంట్​ పరిధిలోనే బీఆర్ఎస్​కు గెలుపు అవకాశాలు ఉండడంతో ఆ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ఇక్కడి నుంచి సిట్టింగ్​ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కొత్త ప్రభాకర్​రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో దానిపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ దక్కని లీడర్లు కూడా ఉన్నారు. కానీ, ప్రస్తుతం ఎమ్మెల్సీలు కవి త, వెంకట్రామిరెడ్డి పేర్లు తెరపైకి రావడం, ఆ వెంటనే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు సీఎం రేవంత్​రెడ్డిని కలవడం హాట్​టాపిక్​గా మారింది.

కేసీఆర్​ ఫ్యామిలీలోనే భిన్నాభిప్రాయాలు

మెదక్​ లోక్​సభ​ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుచోట్ల బీఆర్ఎస్​ గెలిచింది. మెదక్​లో కాంగ్రెస్​ నుంచి మైనంపల్లి రోహిత్​ విజయం సాధించగా..  సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ​సంగారెడ్డి, పటాన్​చెరు, నర్సాపూర్​బీఆర్ఎస్​ ఖాతాలో పడ్డాయి.  పోలైన ఓట్లలో బీఆర్​ఎస్​కు 6,59,183 ఓట్లు రాగా.. కాంగ్రెస్​ పార్టీకి 4,17,976 ఓట్లు దక్కాయి. ఓవరాల్​గా చూస్తే కాంగ్రెస్​ కంటే బీఆర్​ఎస్​ 2 లక్షల 41 వేల 204 ఓట్ల ఆధిక్యం కనబరిచింది.  కేసీఆర్, హరీశ్​రావు, కొత్త ప్రభాకర్​రెడ్డి ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్​, సిద్దిపేట, దుబ్బాక సెగ్మెంట్లలో బీఆర్​ఎస్​కు భారీ మెజారిటీ రావడంతో రాబోయే లోక్​సభ ఎన్నికల్లో మెదక్​ ఎంపీ సీటును ఈజీగా గెలుస్తామన్న ధీమాతో పలువురు బీఆర్ఎస్​ లీడర్లు ఉన్నారు.

అందుకే అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే చిలుముల మదన్​రెడ్డిని కాదని బీఆర్ఎస్​ హైకమాండ్​ సునీతా లక్ష్మారెడ్డికి టికెట్​ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అలకబూనిన మదన్​రెడ్డిని బుజ్జగించేందుకు ఆయనకు ఎంపీ టికెట్​  ఇస్తామని అప్పట్లో గులాబీ పార్టీ హైకమాండ్​ హామీ ఇచ్చింది. దీంతో టికెట్​పై మదన్​రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. నర్సాపూర్​ కాంగ్రెస్​ టికెట్​ ఆశించి భంగపడ్డ గాలి అనిల్​కుమార్​ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కూడా బీఆర్ఎస్​ హైకమాండ్​ ఎంపీ టికెట్​ హామీ ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

మెదక్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన పద్మాదేవేందర్​ రెడ్డి సైతం ఎంపీ టికెట్​ఆశిస్తున్నట్టు ఆమె అనుచరులు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్​.సత్యనారాయణ కూడా తనకు మెదక్​  నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ను కోరారు. వీళ్లంతా టికెట్​రేసులో ఉండగానే ఎమ్మెల్సీలు కవిత, వెంకట్రామిరెడ్డి పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ లీడర్​కు మాజీ మంత్రి హరీశ్​రావు మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. 

కలకలం రేపుతున్న భేటీ

ఓవైపు మెదక్​ ఎంపీ ​టికెట్​కోసం బీఆర్ఎస్​లో పోటాపోటీ నెలకొనగా.. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్​రెడ్డిని  కలవడం గులాబీ పార్టీలో కలకలం రేపుతున్నది. సీఎంను కలిసిన నలుగురు ఎమ్మెల్యేల్లో పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే​ సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి మెదక్ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని వారే కావడం గమనార్హం. ప్రొటోకాల్​, ప్రొటెక్షన్​ అంశాలపైనే సీఎంను కలిశామని ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. బీఆర్ఎస్   కేడర్​లోకి అది ఇంకోరకంగా వెళ్లిపోయింది. మెదక్​లో కవిత ఎంట్రీని అడ్డుకునేందుకే పార్టీలో తెరవెనుక రాజకీయాలు మొదలయ్యాయనే చర్చ జరుగుతున్నది.