హైదరాబాద్, వెలుగు: పట్నంలో బస్తీ దవాఖాన్ల తీరుగా గ్రామీణ ప్రాంతాల్లో పెడ్తున్న పల్లె దవాఖాన్లు ఆయుర్వేద సెంటర్లుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నయి. ప్రతి పల్లె దవాఖానలో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా మిడ్ లెవల్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌ను నియమించేందుకు ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు(బీఏఎంఎస్), నర్సులు ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించింది. నియామకాల్లో ఎంబీబీఎస్ డాక్టర్లకు ఫస్ట్ ప్రయారిటీ, ఆయుర్వేద డాక్టర్లకు సెకండ్ ప్రయారిటీ, నర్సులకు థర్డ్ ప్రయారిటీ ఇచ్చి పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. మొత్తం 1,529 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, 30 శాతం పోస్టులకు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు దరఖాస్తు చేయలేదు. కానీ, ఆయుర్వేద డాక్టర్ల నుంచి ఊహించని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో 29 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, నలుగురు ఎంబీబీఎస్ డాక్టర్లు అప్లై చేయగా, 103 మంది ఆయుర్వేద వైద్యులు అప్లై చేశారు. నర్సుల నుంచి 202 అప్లికేషన్లు వచ్చాయి. రిక్రూట్‌మెంట్ రూల్స్ ప్రకారం 29 పోస్టుల్లో 4 ఎంబీబీఎస్ డాక్టర్లకు, ఇంకో 25 పోస్టులు ఆయుర్వేద డాక్టర్లకు దక్కనున్నాయి. మంచిర్యాల జిల్లాలో 37 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే ఏడుగురు ఎంబీబీఎస్, 92 మంది ఆయుష్ డాక్టర్లు అప్లై చేశారు. ఇక్కడ కూడా 80 శాతానికి పైగా పోస్టులు ఆయుర్వేద డాక్టర్లకే దక్కనున్నాయి. ఆదిలాబాద్‌లో 53 పోస్టులు ఉంటే, ఇద్దరే ఎంబీబీఎస్ డాక్టర్లు అప్లై చేశారు. ఆయుర్వేద డాక్టర్లు 64 మంది పోటీ పడుతున్నారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన పరోక్షంగా పల్లె దవాఖాన్లు అన్నీ ఆయుర్వేద సెంటర్లుగా ఉండబోతున్నాయని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు.
పట్నంలో ఎక్కువ.. పల్లెల్లో తక్కువ జీతం
బస్తీ దవాఖాన్లలో పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్లు, పల్లె దవాఖాన్లలో పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. దీనికి కారణం బస్తీ దవాఖాన్లలో నెలకు రూ.55 వేల వేతనం ఇస్తే, పల్లె దవాఖాన్లలో రూ.40 వేలు చెల్లిస్తున్నారు. పల్లె దవాఖాన్లలో పనిచేస్తున్న డాక్టర్ల కంటే, బస్తీ దవాఖాన్లలో పనిచేస్తున్న డాక్టర్లకు రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ లో ఎక్కువ వెయిటేజీ మార్కులు కలుపుతుండడం మరో కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. ఈ రెండూ కాంట్రాక్ట్ పోస్టులే అయినప్పటికీ బస్తీ దవాఖాన్లు అర్బన్ ఏరియాల్లో ఉండడం, పల్లె దవాఖాన్లు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం మరో కారణంగా చెప్పొచ్చు. పల్లెల్లో డాక్టర్లు దొరకడం కష్టంగా ఉన్నప్పుడు, అక్కడ ఎక్కువ జీతం ఇచ్చి డాక్టర్లను రప్పించాల్సి ఉండగా, తక్కువగా ఇస్తుండడం గమనార్హం. దీంతో పల్లెల్లో పనిచేసేందుకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఇష్టపడడం లేదు. ఆయుర్వేద డాక్టర్లకు పట్నంలో, పల్లెల్లో డిమాండ్ లేదు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో, ఇన్సూరెన్స్ కంపెనీల్లో అత్తెసరు జీతాలకు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పల్లె దవాఖాన్ల పోస్టులకు ఆయుర్వేద డాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి.
నర్సులకు నిరాశే..
రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం పూర్తి చేసి వేల మంది నర్సులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. పల్లె దవాఖాన్లతో వారికి ఒక అవకాశం రావడంతో, ప్రతి జిల్లాలోనూ వందల మంది నర్సులు అప్లై చేసుకున్నారు. కానీ, ఆయుర్వేద డాక్టర్ల రూపంలో వారికి పోటీ ఎదురైంది. ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు అప్లై చేయని జిల్లాల్లో మాత్రమే నర్సులకు అవకాశం ఇస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు లేనప్పటికీ, ప్రతి జిల్లాలోనూ ఆయుర్వేద డాక్టర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో 1,529 పోస్టుల్లో కనీసం 5% కూడా నర్సులకు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. సర్కార్ దవాఖాన్లలో సుమారు 5 వేల స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటి భర్తీకి సర్కార్ నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తోంది.
