
- రిజర్వేషన్లు ఖరారైన గ్రామాల్లో కులాలవారీగా మీటింగులు
- జనం మద్దతు, ఆర్థిక స్థోమత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
- పార్టీలో మద్దతుపై చర్చించాక ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జిలకు సమాచారం
హైదరాబాద్, వెలుగు:గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఊపందుకుంది. సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు స్థానాలకు పోటీ పడాలనుకునే ఆశావహులు, వారి మద్దతుదారులు రహస్య సమావేశాలు, బహిరంగ చర్చలు ప్రారంభించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వర్గంలో మీటింగ్‌ల పర్వం మొదలైంది. గ్రామాన్ని లేదా ఎంపీటీసీ పరిధిని ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న నేతలు, పార్టీల కేడర్, వివిధ సామాజిక వర్గాల పెద్దలు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గం లేదా తమ పార్టీ మద్దతుతో ఎవరు పోటీ చేయాలి, ఎలా గెలవాలి? అనే దానిపై స్పష్టతకు రావడం. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంపై ప్రధానంగా దృష్టి సారించడమే లక్ష్యంగా ఈ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
నేనంటే నేనంటూ..
ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న నేతలు, కేడర్ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. పోటీకి చాలా మంది ఆశావహులు ముందుకు వస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ స్థానానికి తానే అర్హుడినని, గ్రామంలో మంచి పట్టు ఉందని, ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో ఆశావహుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. తమ వర్గాన్ని ఏకం చేసి, తమకు మద్దతు కూడగట్టుకునే పనిలో లీడర్లు నిమగ్నమయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కీలకంగా మారింది. ఏ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిందో దాని ప్రకారమే సమావేశాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఒక సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయితే, ఆ వర్గానికి చెందిన నేతలు మాత్రమే ప్రత్యేకంగా సమావేశమై తమ అభ్యర్థిని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు.
బీసీ రిజర్వేషన్ అయితే, బీసీ వర్గాల పెద్దలు సమావేశమై తమలో అత్యంత బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. దీంతో రిజర్వేషన్‌ను బట్టి వర్గాల వారీగా సమీకరణలు మారుతున్నాయి.
‘ఖర్చు’ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
సమావేశాల్లో నాయకత్వం, ప్రజాదరణతో పాటు అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టుకోగలరనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తోంది. స్థానిక ఎన్నికల్లో గెలుపు అభ్యర్థి వ్యక్తిగత బలం, వర్గం మద్దతుతో పాటు ఆర్థిక వనరులపై కూడా ఆధారపడి ఉంటుందనే అంచనా ఉంది. అందుకే పోటీలో ఎవరు ఉన్నారు? వారిలో ఎవరు ఎంత వరకు ఖర్చును భరించగలరు? ఎన్నికల నిర్వహణకు ఎంత వరకు సహకరించగలరు? అనే అంశాలపై చర్చించి, అన్నింటిలోనూ ముందున్న వారినే అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఆయా వర్గాలు, కేడర్ భావిస్తున్నాయి.
పార్టీ మద్దతుతోనే తుది నిర్ణయం..
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీ గుర్తుపై ఎలక్షన్స్ జరుగుతాయి. సర్పంచ్, వార్డు మెంబర్లకు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఎలక్షన్ ఉంటుంది. దీంతో ఈ ఎన్నికలు వ్యక్తిగత బలంపై జరిగినా, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతోనే ముందుకు వెళ్తారు.
గ్రామాల్లో ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ఎంపికైన అభ్యర్థికి ఏ పార్టీ మద్దతు ఇస్తే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనే దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటున్నారు. పార్టీ మద్దతు లేకుండా ఎన్నికల్లో ముందుకు పోవడం కష్టమని భావిస్తున్న నేతలు, తమ వర్గం లేదా అభ్యర్థి తరఫున ఏ పార్టీ మద్దతు కోరాలనే దానిపై ఏకాభిప్రాయానికి వస్తున్నారు.