బంధులకు ఆశపడితే బానిస బతుకులే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బంధులకు ఆశపడితే బానిస బతుకులే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • నేను సైనిక్ స్కూళ్లు పెడితే  ఈ సర్కార్ వైన్స్ లు పెడుతోంది
  • కేసీఆర్​ శరీరం ప్రగతిభవన్​లో..గుండె దుబాయ్​లో...

కాగజ్ నగర్, వెలుగు: దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసగించే రకం తాను కాదని, బహుజన బిడ్డల బతుకులు మార్చేందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం సీఎం కేసీఆర్ సర్కార్ ఇచ్చే దళిత బంధు, బీసీ బంధు సహా మిగతా బంధులకు ఆశపడితే బానిస బతుకులు మాత్రమే మిగులుతాయన్నారు. సిర్పూర్ టీ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆదివారం సిర్పూర్ టీ, కౌటాల  మండలాల్లో పర్యటించారు. 

ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కోచింగ్ సెంటర్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా యవతను తయారు చేస్తామని, గెలిస్తే  ఫాంహౌస్ కట్టుకోనని అన్నారు. తాను సైనిక్​ స్కూల్స్​ పెట్టిస్తే ఈ సర్కారు వైన్స్​పెడుతూ జనాలను దోచుకుతింటోందన్నారు. సిర్పూర్ లో మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని, తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లు పనిచేయకపోతే ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేదో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించి తన ఫామ్ హౌస్ కు నీళ్లు తెప్పించుకున్నాడని, అంతేగాక కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ లు అన్ని ఆంధ్రా వాళ్ళకే ఇచ్చాడని ఆరోపించారు. 

సీఎం కేసీఆర్ శరీరం ప్రగతి భవన్ లో ఉంటే గుండె మాత్రం దుబాయిలో ఉందన్నారు. దోచుకున్న సంపదనంతా దుబాయ్ లో దాచుకున్నాడన్నారు. పోలీసులు ప్రజలను కాపాడాల్సింది పోయి అమాయకులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తిడితో అక్రమ కేసులు పెట్టి వేధించడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ పబ్లిక్​సర్వీస్​కమిషన్​ను రద్దు చేసి, కొత్త కమిమీషన్ ను నియమించాలన్నారు. 35 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన హైదరాబాద్ లో బీఎస్పీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. కేసీఆర్ తనకు కావాల్సిన వ్యక్తులు, బంధువులకు గ్రూప్-1 ఉద్యోగాలను అమ్ముకోవడం కోసమే టీఎస్పీఎస్సీని పూర్తిగా నిర్వీర్యం చేశాడన్నారు. 

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్,మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి, విజయ నిర్మల, సిడెం జ్యోతి,జిల్లా కోశాధికారి నవీన్,మనోహర్, రాంప్రసాద్,ఇంతియాజ్ పాల్గొన్నారు.