
-
స్వీకరించిన కమిషనర్ రంగనాథ్
-
బల్దియాకు 78, కలెక్టరేట్‌కు 100 అర్జీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు:హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 49 ఫిర్యాదులు రాగా.. ఇందులో ఎక్కువ శాతం రోడ్లు, పార్కుల ఆక్రమణలపైనే ఉన్నాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఫీల్డ్లెవెల్పరిస్థితిని తెలుసుకున్నారు. పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అప్పగించారు.
ఫిర్యాదులు ఇలా....
1. మేడ్చల్–- మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సిద్ధివినాయకనగర్‌లో 30 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోడ్డును ఎదురుగా ఉన్న ప్లాట్ యజమానులు కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఏడు ఎకరాల మేర వేసిన ఈ లే ఔట్‌లో 102 ప్లాట్లు ఉండగా రోడ్డును కబ్జా చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
2. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం, బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్లకు చెందిన చిన్న క్రాంతి కాలనీలో పార్కును కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 114, 118, 120, 121లలో సుమారు 1800 గజాల పార్కు స్థలాన్ని అనధికారికంగా నకిలీ ప్లాట్ నంబర్లు వేసి ఆక్రమించారని పేర్కొన్నారు. కాలనీవాసులకు కేటాయించిన పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు.
3. రంగారెడ్డి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని పోథాయపల్లిలో ఉంటున్న కొందరు స్థానికులు తమ ఇంటికి వెళ్లే రోడ్డును కబ్జా చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది రోడ్డుపై గోడ నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
4. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్ జూబిలీ గార్డెన్ కాలనీలో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాలను ఆపాలని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. కొత్తగూడ గ్రామం సర్వే నంబర్30లో 14 గుంటలు, సర్వే నెంబర్29లో ఎకరం 2 గుంటల భూమి ప్రభుత్వానికి చెందినదిగా రికార్డుల్లో ఉంది. కాంపౌండ్ వాల్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కూడా కూల్చారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం భూమిని సరిగా గుర్తించి తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు.
5.మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లికి చెందిన ఫీర్జాదీగూడలోని 30 అడుగుల రోడ్డును కబ్జా చేశారంటూ శ్రీ సాయి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతంలోని పంచవటి కాలనీకి చెందిన కొంతమంది వ్యక్తు లు ఈ రోడ్డును ఆక్రమిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు: కమిషనర్
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి 74 ఫిర్యాదులు రాగా, కమిషనర్ స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 37 ఫిర్యాదులు వచ్చాయి. గ్రేటర్ లోని ఆరు జోన్లలో 126 ఫిర్యాదులు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 55, శేరిలింగంపల్లి జోన్ లో 28, సికింద్రాబాద్ జోన్ లో 27, ఎల్బీనగర్ జోన్ లో 9, చార్మినార్ జోన్ లో 6, ఖైరతాబాద్ జోన్ లో ఒక ఫిర్యాదు అందింది.
కలెక్టరేట్ ప్రజవాణికి 162 ..
హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 162 ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన 100 అర్జీలు, రంగారెడ్డి కలెక్టర్ ప్రతిమా సింగ్ 62 అర్జీలు స్వీకరించారు.