అంబులెన్స్​ టైంకు వస్తలే

అంబులెన్స్​ టైంకు వస్తలే
  • ఆరోగ్యశాఖకు ఫిర్యాదుల వెల్లువ
  • నిర్వాహణపై జీవీకేకు, సర్కార్‌‌‌‌కు మధ్య కుదరని సయోధ్య
  • ఆ సంస్థను తప్పించాలని ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : హెల్త్ ఎమర్జెన్సీలో వేగంగా స్పందించి, బాధితులను నిమిషాల్లో దవాఖాన్లకు చేర్చాల్సిన 108 అంబులెన్స్‌‌లు గంటలు గడిచినా స్పాట్‌‌కు రావడం లేదు. సకాలంలో అంబులెన్స్ రాలేదని, 108కు కాల్ చేస్తే స్పందించడం లేదన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్‌‌ల నిర్వాహణ విషయంలో జీవీకే సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఫిర్యాదులు పెరిగాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. 108 అంబులెన్స్‌‌ సర్వీసుల నిర్వాహణ విషయంలో జీవీకే కాంట్రాక్ట్ గడువు ముగిసి నాలుగేండ్లు దాటింది. మరోవైపు, ఈసారి టెండర్ల ప్రక్రియ ద్వారా అంబులెన్స్‌‌ల నిర్వహణ బాధ్యతలను కొత్తవాళ్లకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన డబ్బులు వస్తాయో లేదోనని జీవీకే ఆచితూచి వ్యవహరిస్తున్నది. కాగితాల మీద సుమారు ఐదొందల అంబులెన్స్‌‌ల లెక్క ఉన్నప్పటికీ, అందులో వందకుపైగా అంబులెన్స్‌‌లు రోజూ  షెడ్డుకే పరిమితమవుతున్నాయి. రిపేర్ల పేరిట కొన్ని, డీజిల్ కొట్టియ్యక కొన్ని బయటకు రావడం లేదు. 108 కాల్ సెంటర్‌‌‌‌ కూడా జీవీకే సంస్థనే నడిపిస్తున్నది. వెహికల్ డౌన్‌‌ ఉన్న ప్రాంతం నుంచి ఫోన్లు వస్తే, వేరే పేషెంట్‌‌ షిఫ్టింగ్‌‌లో వెహికల్ ఉందని సమాధానం చెప్పి తప్పించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

పది రోజుల్లో టెండర్లు
రాష్ట్రం ఏర్పడకు ముందు నుంచే 108 అంబులెన్సుల ​ నిర్వాహణ బాధ్యతలు జీవీకే వద్ద ఉన్నాయి. ఇన్నాళ్లూ నామినేషన్ పద్ధతిలో ఆ సంస్థకే బాధ్యతలు అప్పగిస్తూ వచ్చిన సర్కార్, ఇప్పుడు ఆ సంస్థను తప్పించాలని నిర్ణయించింది. టెండర్‌‌‌‌ ప్రక్రియకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు రెండు రోజుల కిందట్నే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెండర్లు పిలవాలని ఆరోగ్యశాఖకు సూచించింది. పది రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు చెప్తున్నారు.