షరతుల ఎవుసం సాగేదెట్ల?

షరతుల ఎవుసం సాగేదెట్ల?

కొత్త పంటల విధానంపై రైతుల్లో ఆందోళన
కొన్ని జిల్లాల్లో నేల స్వభావానికి భిన్నంగా పంటల ఎంపిక
పత్తి సాగు పెరిగితే ప్రమాదమేనంటున్న ఎక్స్​పర్ట్స్​
చెప్పిన పంట వేయకుంటే రైతుబంధు రాదంటున్న లీడర్లు, ఆఫీసర్లు
గిట్టుబాటు ధర ప్రకటిస్తేనే సన్న వడ్లు పండిస్తామంటున్న రైతులు
ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత.. పంచాయతీల్లో తీర్మానాలు

నెట్వర్క్, వెలుగు రాష్ట్ర సర్కారు అమలు చేయాలనుకుంటున్న కంట్రోల్డ్​ వ్యవసాయ విధానంపై రైతుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. ఈ వానాకాలంలో సుమారు 65 లక్షల ఎకరాల్లో పత్తి, 42 లక్షల ఎకరాల్లో వరి, 12 లక్షల ఎకరాల్లో కంది, 4 లక్షల ఎకరాల్లో సోయాబిన్​ను ప్రధానంగా పండించాలని నిర్ణయించింది. జిల్లాలవారీగా ఏ పంటలు వేయాలో కూడా తానే ప్లాన్​ చేసి.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అగ్రికల్చర్​ ఆఫీసర్లను ఆదేశించింది. దీంతో జిల్లాల్లో ఆఫీసర్లు , లీడర్లు అవగాహన కార్యక్రమాల పేరిట సమావేశాలు పెడుతూ ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలంటున్నారు. చెప్పిన పంటలు వేయకపోతే రైతుబంధు రాదనేలా మాట్లాడుతున్నారు. ఇతర సీడ్స్​ అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఆయా విత్తనాలు అమ్మకుండా బ్యాన్​ విధిస్తున్నారు. దీనిపై  రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. గ్రౌండ్​లెవల్​లో నేలల స్వభావాన్ని, తమ అనుభవాల్ని పరిగణనలోకి తీసుకోని ఆఫీసర్లు తాము ఏ పంట సాగుచేయాలో ఎట్ల చెబుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని పంచాయతీలైతే ఏకంగా షరతుల వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తున్నాయి.

పత్తి సాగు పెరిగితే ప్రమాదమే

నిరుడు వానాకాలంలో 46.48 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఈసారి అదనంగా 18.52 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా పత్తి సాగు విస్తీర్ణం పెంచాలన్న ప్రభుత్వ ప్లాన్​తో  పంట భూములకు, పర్యావరణానికి తీరని నష్టం జరగనుంది. మొదట పత్తి విత్తనాలకు ఎక్కడా లేని డిమాండ్ పెరుగుతుంది.

ఈ క్రమంలో చాలా కంపెనీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన హెర్బిసైడ్ టోలరెంట్(హెచ్టీ) లేదా బీటీ–3 (బోల్​గార్డ్​)  సీడ్స్​ అమ్మేందుకు రెడీ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పత్తి సాగులో 20 శాతం బీటీ3 రకం విత్తనాలే. మన రాష్ట్రంలో ఇది 30 శాతంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇది మరింత పెరిగే ప్రమాదముంది. బీటీ3 రకం సీడ్​ మొలకెత్తిన నాలుగు వారాలలోపు గ్లైఫోసేట్ హెర్బిసైడ్ పిచికారీ చేస్తే పత్తి మొక్క తప్ప కలుపు మొక్కలన్నీ చనిపోతాయి. ఈ కలుపు నివారణ కోసమే రైతులు బీటీ–3 రకాలకు ఎగబడుతున్నారు. దీనిని కంపెనీలు క్యాష్​ చేసుకుంటున్నాయి. గత అనుభవాలను బట్టి బీటీ–3 విత్తనాల బ్లాక్​మార్కెటింగ్​ను అరికట్టడం ప్రభుత్వం వల్ల కావట్లేదు. పోయిన సీజన్​లో ఉమ్మడి మెదక్‌‌, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల్లో బీటీ–3 రకమే ఎక్కువ సాగైంది. పత్తి చేలల్లో కలుపు నివారణ, పురుగుమందులను విచ్చలవిడిగా వాడడం వల్ల భూములన్నీ నిస్సారమవుతున్నాయి. ఆ పవర్​కు వానపాములు కొన్ని మీటర్ల లోతుకు వెళ్లిపోతున్నాయి. పొరపాటున పత్తి కట్టెను పశువులు మేస్తే ఆ పశువులు కూడా చనిపోతున్నాయి. రైతులు క్యాన్సర్​ లాంటి రోగాలబారిన పడుతున్నారు. ఒక్కసారి బీటీ–3 పత్తి విత్తనాలు సాగుచేస్తే ఆ భూమిలో కొన్నేండ్ల దాకా ఇతర పంటలు పండించే విషయాన్ని దాదాపు మరిచిపోవాలి. అదీగాక కాటన్​ మార్కెట్ అంతర్జాతీయ పరిణామాలతో ముడిపడి ఉంటుంది. ఏమాత్రం తేడావచ్చినా డిమాండ్​తోపాటు ధర కూడా అమాంతం పడిపోతుంది. ఇదే జరిగితే పత్తి రైతులను ఆదుకోవడం ప్రభుత్వాల తరంకాదని ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు.

జిల్లాల్లో భిన్న పరిస్థితులు

జిల్లాల్లో నేలల స్వభావం, రైతుల తరతరాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా పంటలను ఎంపిక చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్‌‌లో 6,500 ఎకరాల్లో ఆయిల్‌‌ పామ్‌‌ సాగుకు ఆఫీసర్లు నిర్ణయించారు. కానీ ఎలా సాగు చేయాలో ఏ ఒక్క రైతుకూ తెలియదు. ఈక్రమంలో పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నా  అమ్మకాలు ఆపేశారు.

కామారెడ్డి జిల్లాలో ప్రతి వానాకాలం సీజన్​లో లక్ష ఎకరాల్లో రైతులు మక్క వేసేవారు. ఈసారి పత్తి వేయాలని అధికారులు చెబుతున్నారు. కానీ తమకు పత్తిలో అనుభవం లేదని, ఖర్చుల పాలవుతామని, భూములు పాడవుతాయని రైతులు అంటున్నారు.

ఉమ్మడి మెదక్​ జిల్లా రైతులదీ ఇదే పరిస్థితి. మక్క తక్కువ కాలంలో చేతికి వస్తే చాలామంది రైతులు అదే భూమిలో వెంటనే కూరగాయలు సాగుచేస్తారు. ఇప్పుడు పత్తి వేయాలని ఆఫీసర్లు చెప్పడంతో అయోమయంలో పడ్డారు. దొడ్డు వడ్లకు బదులు సన్నాలు సాగు చేయాలని ఆఫీసర్లు చెప్తున్నా ముందుగా మద్దతు ధరపై స్పష్టత ఇయ్యాలంటున్నారు. ఇటీవల గజ్వేల్‌‌లో రైతులతో జరిగిన  సమావేశంలో దీనిపైనే రైతులు నిలదీయగా ఆఫీసర్లు దాటవేశారు.

మహబూబాబాద్ జిల్లాలో మక్క పంట వేయొద్దని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ జిల్లాలోని గంగారం, కొత్తగూడ , బయ్యారం, గార్ల మండలాల ఏజెన్సీ ఏరియాల్లో భూమి సమతలంగా లేకపోవడం, నీటి వసతి తక్కువగా ఉన్నందున తమకు మక్క పంట తప్ప వేరే గత్యంతరం లేదని రైతులు అంటున్నారు. ఇటీవలే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో మక్క పంట వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌‌కు వినతిపత్రం ఇచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 శాతం సన్నరకాలు సాగు చేయాలని చెప్పగా రైతులు అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు. సన్న రకం  దిగుబడికి ఎక్కువ టైం పడుతుందని, చివర్లో నీటి తడులు సరిపోక పంటలు ఎండిపోతే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని18, 392 ఎకరాల్లో పత్తికి బదులు పామాయిల్ సాగు చేయాలని ఆఫీసర్లు చెప్పడంపై రైతులు అయోమయంలో పడ్డారు.

పెద్దపల్లి జిల్లాలో మెజారిటీ భూములకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సాగు నీరు అందుతుండటంతో చాలా మంది రైతులు పత్తి చేన్లను వరి పొలాలుగా మార్చారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు 81వేల ఎకరాల్లో పత్తి వేయాలని అంటోంది. నీళ్లతో ఎప్పుడూ నాని ఉండే తరి భూముల్లో పత్తి పండించడం సాధ్యం కాదని రైతులు అంటున్నారు.

షరతుల సాగు వద్దు

కరీంనగర్​ జిల్లా చర్లపల్లి పంచాయతీ తీర్మానం

గంగాధర, వెలుగు: కరీంనగర్​ జిల్లా గంగాధర మండలంలోని చర్లపల్లి (ఎన్​) గ్రామ రైతులు ప్రభుత్వం చెబుతున్న షరతుల వ్యవసాయ  విధానానికి వ్యతిరేకంగా సోమవారం గ్రామ సభలో తీర్మానం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా, పంటలకు మద్దతు ధర ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ విధానంతో గ్రామంలోని రైతులంతా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలంటూ తీర్మానంలో సూచించారు.  కార్యక్రమంలో సర్పంచ్ కనకయ్య, ఉప సర్పంచ్ బాబురెడ్డి, వార్డు సభ్యులు ఎడవెల్లి శశిధర్​రెడ్డి, సంపత్, శేఖర్, మంజుల, సుమలత, శ్యామల, మమత, రైతులు లచ్చయ్య, మనోహర్​రెడ్డి, భూమయ్య, రాయమల్లు, మల్లారెడ్డి, పెద్ది కుమార్ పాల్గొన్నారు.

సన్న వడ్లతో సమస్యే

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యాసంగిలో దొడ్డు రకాలు, వానకాలంలో సన్న, దొడ్డు రకాలు పండిస్తారు. బీపీటీ, హెచ్​ఎంటీ లాంటి సన్నరకాల పంట కాలం ఎక్కువ. దొడ్డు రకం వడ్లు 3 నుంచి 4 నెలల్లో కోతకొస్తే.. సన్నరకాలు 5 నెలలు గడిస్తే గానీ చేతికి రావు. దొడ్డు రకాలతో పోలిస్తే సన్నరకాలు చీడపీడలను తట్టుకోవు. పైగా ఎరువులు, పురుగు మందులు ఎక్కువవాడాలి. అందుకే  పెట్టుబడి ఎక్కువ. తీరా దిగుబడి  తక్కువ వస్తుంది. ఎకరాకు దొడ్డురకం వడ్లతో పోలిస్తే సన్నరకం వడ్ల దిగుబడి నాలుగైదు క్వింటాళ్లు తక్కువగా ఉంటుంది. కానీ ఏ రకం వడ్లకైనా ప్రభుత్వ మద్దతు ధర ఒక్కటే కావడంతో రైతులు సన్నాల కంటే దొడ్డురకాలను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ప్రభుత్వం సన్నరకాలను సాగుచేయాలని చెబుతుండడంతో నష్టం తప్పదని రైతులు  ఆందోళన చెందుతున్నారు. 2019–20లో వరి ధాన్యానికి  ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ. 1,345 కాగా, మిల్లర్లు సన్నవడ్లను రూ. 2వేల దాకా కొన్నారు. సన్నాలనే ఎక్కువగా పండిస్తే మిల్లర్లు రేటు తగ్గిస్తారనడంలో అనుమానం లేదు. అందువల్ల సన్నాలకు రాష్ట్ర సర్కారు ముందుగా గిట్టుబాటు ధర నిర్ణయించాలని, అప్పుడే వాటిని సాగుచేస్తామని రైతులు తేల్చిచెబుతున్నారు.

ఏం చేయలో సమజైతలేదు

ఈసారి మక్కలు వేయద్దని సర్కార్‌‌ చెప్తాంది. పత్తి సాగు చెద్దామంటే ఎర్ర నేలలో దిగుబడి రాదు. ప్రభుత్వం పెట్టిన రూల్‌‌తో ఏం చేయాలో సమజైతలేదు. ఈ విషయంలో సర్కారు మరోసారి ఆలోచన చేయాలె. ఎవరి ఇష్టమైన పంట వారు పండించునేలా చూడాలె.

– జాలిగామ రమేశ్​, శ్రీరాములుపల్లి, కోహెడ మండలం, సిద్దిపేట జిల్లా

గిట్టుబాటు ధర ప్రకటించాలె..

పంటలు వేసుకునే స్వేచ్ఛ రైతులకే ఉండాలె. కాదు, కూడదు ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలంటే ముందుగా గిట్టుబాటు ధర ప్రకటించాలె. ఆ రేటుకే కొనాలె.  అంతే తప్ప ప్రభుత్వం చెప్పిన పంట వేసి, తీరా రేటు లేక నష్టపోతే ఎవరు బాధ్యులు?

– మాదాసు  రమేశ్​, రైతు, పాలకుర్తి ,పెద్దపల్లి

సర్కార్‌‌ ఆలోచించాలె

చాలాకాలంగా వరి పంటే  పండిస్తున్నం. ఇప్పడు కూడా అదే వేస్తం. మా భూముల్లో మక్కలు, పత్తి, కంది వేస్తే పండవు. కానీ సర్కారు సహకరిస్తలేదు. విత్తనాలు, మందులు ఇస్తలేదు. ఇప్పటికైనా ఆలోచించాలె. – బుద్దె శ్రీనివాస్, ఇటిక్యాల, మంచిర్యాల జిల్లా

అచ్చుకట్టు భూముల్లో దిగుబడి రాదు  

సర్కార్‌‌ చెప్పిన పంట వేస్తే రైతులకు గిట్టుబాటు కాదు. మా జిల్లా రైతులు ఎక్కువగా వరి, పత్తి, మక్క సాగుకే అలవాటుపడ్డరు. వరి కోసం అచ్చుకట్టిన భూముల్లో ఇతర పంటలు వేస్తే దిగుబడి రాదు. చిరుధాన్యా లు, సన్నరకం వరి సాగు చేస్తే  సర్కార్‌‌ మార్కెటింగ్, మద్దతు ధర ఇయ్యకపోతే నష్టమే. సర్కార్‌‌ చెప్పే పంటలు రైతులు వేయాలంటే ప్రభుత్వమే మార్కెటింగ్, మద్దతు ధర కల్పించాలె. ఇన్సూరెన్స్ చెల్లించాలె. ఎరువులు, ఇతర రాయితీలు కూడా ఇయ్యాలె. రైతుబంధుపై ఆంక్షలు పెట్టొద్దు.  – వెల్మ బాపురెడ్డి, రైతు, గుమ్లాపూర్, కరీంనగర్

పత్తితో చాలా నష్టపోయిన

మూడేండ్ల కిందటి దాక పత్తి పంట వేసిన. తెగుళ్లు ఎక్కువ. పంట దిగుబడి తక్కువ. ఒక్కసారైతే లాగోడికి పెట్టిన పైసలు కూడా రాలె. రెండేండ్ల నుంచి పత్తి పంట బంద్ చేసి మక్క వేస్తున్న. నష్టాలు  లేవు. అమ్మడానికీ కష్టపడలే.  కానీ ఇప్పుడు గవర్నమెంటోళ్లు మక్క వేయద్దంటున్నరు. మక్క పంట వద్దంటే ఎట్ల.? మా ఊర్లె రైతులు ఏం జేస్తే నేను అదే జేస్త. – కుమ్మరి నర్సయ్య, రైతు,  కృష్ణాజీవాడి, కామారెడ్డి జిల్లా

చెప్పిన పంటేస్తే అప్పులపాలైత

వరి, కూరగాయలు తప్ప ఏ పంటలు వేయడం రాదు. సన్నరకం వడ్లు ఎప్పుడు పండించినా నష్టమే వచ్చింది. సౌడు భూమి కావడంతో దిగుబడి ఎక్కువగా రాదు. సర్కార్ చెప్పిన పంటలే వేస్తే మరింత అప్పుల పాలైత. పండించిన పంటకు మద్దతు ధర ఇస్తే చాలు. కొత్త రూల్స్ పెట్టద్దు.

-జి.సత్తయ్య, రైతు, మేడిపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది