యాజమాన్యం వేధిస్తోందంటూ..నర్సింగ్​ స్టూడెంట్ల ఆందోళన

యాజమాన్యం వేధిస్తోందంటూ..నర్సింగ్​ స్టూడెంట్ల ఆందోళన

కాజీపేట, వెలుగు: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ కాలేజీ స్టూడెంట్లు కాలేజీ గేట్ ముందు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా కాజీపేట దర్గా రోడ్ లోని సెయింట్ ఆన్స్ నర్సింగ్ కాలేజీలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కేరళ, అస్సాం, మేఘాలయకు చెందిన సుమారు 200 మంది స్టూడెంట్లు బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారు. వీరిలో కొందరు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా చదువుతుండగా మరికొందరు సంవత్సరానికి లక్ష రూపాయల ఫీజు కట్టి మేనేజ్ మెంట్ కోటా ద్వారా చదువుతున్నారు. దూర ప్రాంతాలకు చెందిన స్టూడెంట్లు నెలకు రూ. 3 వేల ఫీజు కట్టి కాలేజీ హాస్టల్ లో ఉంటున్నారు. 
అయితే కాలేజీ యాజమాన్యం తమ పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందంటూ స్టూడెంట్లు గురువారం కాలేజీ గేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ హాస్టల్​లో సరైన తిండి పెట్టడం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మధ్యాహ్నం మిగిలిన ఆహారాన్నే రాత్రికి పెడుతున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే మీరు తినకుండా మిగిల్చారు కాబట్టి మళ్లీ మీకే పెడుతున్నామని అంటున్నారన్నారు. టాయిలెట్లు కంపుకొడుతున్నాయని, కరోనా టైంలోనూ కనీసం శానిటైజ్​ చేయడం లేదన్నారు. ఆరోగ్యం బాగాలేక ఒక్కరోజు కాలేజీకి వెళ్లకపోయినా ఫైన్​లు వేయడం, ఎక్స్ ట్రా డ్యూటీలు వేసి వేధిస్తున్నారన్నారు. 
ఎప్పుడో ఒకసారి తమను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులతోనూ కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. చదువులో భాగంగా కాలేజీ హాస్పిటల్​లో తాము సేవలు చేయాల్సి ఉంటుందని, అలా నలుగురు స్టూడెంట్లకు కరోనా పాజిటివ్ వస్తే వారికి ట్రీట్​మెంట్ చేయడానికి కూడా డబ్బులు చార్జి చేస్తున్నారని వాపోయారు. ప్రశ్నిస్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని కాలేజీ ప్రిన్సిపల్, హాస్టల్ ఇన్​చార్జి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని తమ పట్ల కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
పీహెచ్​సీ అధికారి హిమబిందు, పోలీసులు, పలు పార్టీల నాయకులు అక్కడికి చేరుకుని స్టూడెంట్లతో మాట్లాడారు. చివరకు యాజమాన్యం 15 రోజుల్లో స్టూడెంట్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. 172 మంది స్టూడెంట్లకు మెడికల్ ఆఫీసర్ హిమబిందు అక్కడే కొవిడ్ టెస్టులు చేశారు. నలుగురికి పాజిటివ్​గా తేలడంతో వారికి ఐసోలేషన్ కిట్లు అందించి క్వారంటైన్​లో ఉంచారు.
హాస్టల్​ను పరిశీలించిన ఆఫీసర్​
జిల్లా కలెక్టర్, డీఎంఅండ్ హెచ్​వో ఆదేశాల మేరకు డిస్ట్రిక్ సర్వేలేన్స్ ఆఫీసర్ క్రిష్ణారావు హాస్టల్​కు వెళ్లి పరిశీలించారు. స్టూడెంట్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మెస్ ఫుడ్, తాగునీటి శాంపిల్స్​తీసుకుని ల్యాబ్​కి పంపించారు. హాస్టల్ లో ఉండే అసౌకర్యాలు, అనుమతి లేకుండా కొవిడ్ టెస్టులు, ట్రీట్​మెంట్ చేయడంపై నోటీసులు అందజేయనున్నట్లు చెప్పారు. మూడు రోజుల్లో యాజమాన్యం స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.