గ్యాస్ లీకేజీ ఘటనలో ఆస్పత్రి ఖర్చులు కాలేజీనే భరించాలని తల్లిదండ్రుల ఆందోళన

గ్యాస్ లీకేజీ ఘటనలో ఆస్పత్రి ఖర్చులు కాలేజీనే భరించాలని తల్లిదండ్రుల ఆందోళన

కంటోన్మెంట్, వెలుగు : గ్యాస్​ లీకేజీతో అస్వస్థతకు గురై హాస్పిటల్​లో  ట్రీట్​మెంట్ పొందుతున్న స్టూడెంట్ల పూర్తి ఖర్చులు కాలేజీ యాజమాన్యమే భరించాలని పేరెంట్స్  మంగళవారం మారేడ్ పల్లిలోని కేజీబీవీ వద్ద ఆందోళనకు దిగారు. తమ పిల్లల అనారోగ్యానికి కారణమైన వ్యాధిని గుర్తించేలా డాక్టర్లను ఒత్తిడి చేయాలని డిమాండ్​ చేశారు. వారి ఆరోగ్యంపై  క్లారిటీ ఇవ్వాలంటూ తల్లిదండ్రులు పట్టుబట్టారు. జరిగిన సంఘటనకు తమ పాత్ర ఏమీ లేదని, తాము బాధ్యులం కాదని యాజమాన్యం  నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహానికి  గురైన  పేరెంట్స్..​ వారితో వాగ్వాదానికి దిగారు. అక్కడున్న కుర్చీలను   అధ్యాపకులపై విసిరేశారు. వాగ్వాదం కాస్తా  తోపులాటకు దారి తీసి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని  ఇరు వర్గాలను శాంతింపజేశారు. తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ఆవరణలో ఆందోళన చేస్తున్న ఓ బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

కేజీబీవీని సందర్శించిన జిల్లా జడ్జి, చైల్డ్​ ప్రొటెక్షన్​ సభ్యులు

కస్తూర్బా కాలేజీలో జరిగిన గ్యాస్​ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.. ఈ ఘటనను ​సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. మంగళవారం మరో ముగ్గురు విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలిసి చైల్స్​ రైట్స్​ ప్రొటెక్షన్​ ప్రతినిధులు వర్ష, శ్రీనివాస్, హైకోర్టు మెంబర్​ సెక్రటరీ గోవర్ధన్​రెడ్డి, జిల్లా జడ్జి మురళీమోహన్​ ఆ కాలేజీని సందర్శించారు. స్టూడెంట్లు, పేరెంట్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలేజీలోని ల్యాబ్​ను పరిశీలించి  వివరాలు సేకరించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను వారు ఆదేశించారు.

డిశ్చార్జ్ అయినా కోలుకోని విద్యార్థినులు

గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై యశోద హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన వారిలో ఐదుగురు విద్యార్థినులు ఇంకా కోలుకోలేదు. దీంతో వారిని నిమ్స్​లో అడ్మిట్​చేశారు. వీరిలో తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన పాక రామస్వామి కూతురు, ఇంటర్ సెకండియర్ స్టూడెంట్ మేఘన పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ఈనెల 26న తిరిగి హాస్పిటల్​లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా నిమ్స్​ నుంచి డిశ్చార్జి ​అయిన వారిలో అర్పిత, షేక్​ షబానాలు కాలేజీకి వచ్చి అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే వారిని నిమ్స్​కు తరలించారు.
విషవాయువు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్​ శ్రీనివాస్​రావు, మెంబర్​అపర్ణ, హైదరాబాద్​ జిల్లా జడ్డీ మురళీ మోహన్​, హైకోర్టు  మెంబర్​ సెక్రటరీ గోవర్దన్​రెడ్డి తెలిపారు.

ల్యాబ్ నుంచి వ్యాపించలేదు: కాలేజీ సెక్రటరీ

కాలేజీ ల్యాబ్ నుంచి ఎలాంటి గ్యాస్ ​లీక్ ​కాలేదని, స్టూడెంట్ల అస్వస్థతకు అది కారణం కాదని కాలేజీ సెక్రటరీ చక్రవర్తి, చైర్మన్ జానకి రామ్​ తెలిపారు. చెత్త కుప్ప నుంచి విషవాయువు వెలువడిందని పేర్కొన్నారు. గ్యాస్​ లీకేజీలో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు వైద్య ఖర్చులన్నిటిని  యాజమాన్యమే భరిస్తోందని పేర్కొన్నారు.

వ్యాధి నిర్ధారించకుండానే డాక్టర్లు మందులిస్తున్నరు

ఈ ఏడాది నవంబరు 18న  సికింద్రాబాద్​ ఈస్ట్ ​మారేడ్​పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల  కాలేజీలో  ల్యాబ్​లో స్టూడెంట్లు ప్రాక్టికల్స్​ చేస్తుండగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో  ల్యాబ్​లో 38 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 10 మంది సృహ తప్పి ల్యాబ్​లోనే పడిపోయారు. బాధితులకు వివిధ ఆసుపత్రులలో  చికిత్స అందించి డిశ్చార్జ్​ చేయగా, ఇంటికి వెళ్లిన వారిలో అర్చన, శ్రుతి, షేబ్ షబానా అనే విద్యార్థినులు మంగళవారం మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. వారి ఆరోగ్యం మరింత క్షీణించిందని వారి తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ పిల్లల ఆరోగ్యం విషయంలో ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ఇప్పటికీ వారి ఆరోగ్య సమస్య ఏమిటో డాక్టర్లు నిర్ధారించకుండానే మందులు ఇస్తున్నారని వాపోయారు. తమ పిల్లల అనారోగ్యానికి కారణమై గ్యాస్​ ఏమిటో నిర్ధారించాలని డిమాండ్​ చేశారు. పిల్లలు డిశ్చార్జ్​  అయి ఇంటికి రాగానే రోగం మళ్లీ ముదురుతున్నదని, రోగ నిర్ధారణ లేకుండానే ట్రీట్​మెంట్  చేయడం వల్ల వారి ఆరోగ్యం మరింతగా క్షీణిస్తున్నదని పేరెంట్స్  ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ పిల్లలకు  ఇంటర్నల్స్ పరీక్షల్లో మార్కులు తగ్గించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని, వెంటనే ఆ ఆలోచన మానుకోవాలని కోరారు.