చిల్డ్రన్స్ డే రోజున.. పరిహారం కోసం విద్యార్థుల ఆందోళన

చిల్డ్రన్స్ డే రోజున.. పరిహారం కోసం విద్యార్థుల ఆందోళన

మహారాష్ట్రలోని సిరొంచ గ్రామ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కారణంగా.. 12 గ్రామాల వ్యవసాయ భూములు ముంపుకు గురవుతున్నాయి. దీనివల్ల నాలుగేళ్లుగా తాము వ్యవసాయం చేసుకోలేక కొట్టుమిట్టాడుతున్నామని అక్కడి రైతులు గత వారం రోజులుగా నిరసన దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. సిరొంచ తాలుకా రైతులు రోజుకో విధంగా నిరసనలు తెలుపుతున్నారు. చిల్డ్రన్స్ డే కావడంతో.. బాధిత రైతుల పిల్లలు దీక్షకు దిగారు. తమ తల్లిదండ్రులు పడుతున్న వేదన నుంచి వారిని కాపాడాలని కోరారు. పంటలు చేతిక రాక.. తమ తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లుగా కన్నీటిపర్యంతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వ్యవసాయం దెబ్బతినడంతో తమను పోషించే పరిస్థితి లేదని విద్యార్థులు తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు మేడిగడ్డ బ్యారేజీ వల్ల ముంపునకు గురవుతున్న భూములకు పరిహారం ఇప్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. తమలోని ప్రతిభా పాటవాలను ప్రదర్శించాల్సిన ఆ విద్యార్థులు చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాచా నెహ్రూ గురించి కథలు చెప్పాల్సిన వయసులో.. తమ తల్లిదండ్రుల కన్నీటి వ్యథను చూసి ఆదుకోండి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నోటు పుస్తకాలు పట్టుకుని స్కూలుకు వెళ్లాల్సిన విద్యార్థులు.. తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి నిరసనకు దిగారు. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.