ట్రాన్స్ జెండర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

 ట్రాన్స్ జెండర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
  • మాపై వివక్ష ఉంది.. గుర్తింపు లేదు
  • నేషనల్ నెట్​ వర్క్ అడ్వైజరీ మెంబర్ రచన 

ముషీరాబాద్,వెలుగు : సమాజంలో ట్రాన్స్ జెండర్లు యాచించడం తప్ప గౌరవంగా జీవించే హక్కు లేకుండా పోయిందని ట్రాన్స్ జెండర్ నేషనల్ నెట్ వర్క్  అడ్వైజరీ మెంబర్ రచన ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు గుర్తింపు, పథకాల అమలుకు చేస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ట్రాన్స్ జెండర్ కు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిబ్బ, గరిమ  స్వచ్ఛంద సంస్థల సహకారంతో 300 మంది ట్రాన్స్ జెండర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రచన హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో ట్రాన్స్ జెండర్లపై  వివక్షత ఉందే తప్ప.. గుర్తింపు లేదన్నారు. ట్రాన్స్ జెండర్స్ ఎంతోమంది అనేక రకాల నైపుణ్యాలతో గొప్పగా ఉన్నారని వారందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తారని తెలిపారు.

గుర్తింపు కార్డులు, హెల్త్ కేర్, ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, కొండవీటి సత్యవతి, ముకుంద మాల తదితరులు పాల్గొన్నారు.