బాలాపూర్​ లో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకుల ఆందోళన

బాలాపూర్​ లో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకుల ఆందోళన

ఎల్ బీనగర్,వెలుగు: ట్రాఫిక్ పోలీసులు గల్లీల్లోకి వచ్చి మరీ చలాన్లు విధిస్తున్నారని.. ట్రాఫిక్ సమస్యను గాలికొదిలేసి చలాన్లపై పడుతున్నారంటూ మీర్ పేట కార్పొరేషన్​ కు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ నర్సింహా, నాయకులు  స్థానికులతో కలిసి శనివారం బాలాపూర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేటర్ మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ కార్పొరేటర్ ఎడ్ల మల్లేశ్ సైతం అక్కడికి చేరుకుని ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలాన్లపై మండిపడ్డారు.

అనంతరం ఇద్దరు కార్పొరేటర్లు మాట్లాడుతూ.. రోడ్లపై, వైన్స్ వద్ద అడ్డగోలుగా పార్కింగ్ చేస్తుంటే పట్టించుకోని ట్రాఫిక్ సిబ్బంది గల్లీల్లోకి వచ్చి మరీ చలాన్లు వేయడమేంటని ప్రశ్నించారు. ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్లపై మాత్రమే దృష్టి పెట్టారని, తమ టార్గెట్​ను రీచ్ అయ్యేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రూల్స్ బ్రేక్ చేసిన వారికి చలాన్లు వేయాలే కానీ గల్లీలో ఇంటి ముందు పార్క్ చేసిన వెహికల్స్ కు ఫైన్ వేయడం సరికాదన్నారు.  

రూల్స్ బ్రేక్ చేసిన వారికి చలాన్లు విధిస్తున్నామని ఎల్​ బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ అంజయ్య తెలిపారు.  ట్రాఫిక్ జామ్​ను  ఎప్పటికప్పుడు  క్లియర్ చేస్తున్నామన్నారు. గల్లీలకు వెళ్లి చలాన్లు విధించలేదన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలన్నారు.