మా సంస్థ అప్పులపై ఆందోళనలు అక్కర్లే : అదానీ గ్రూప్‌‌

మా సంస్థ అప్పులపై ఆందోళనలు అక్కర్లే : అదానీ గ్రూప్‌‌
  • అప్పులపై టెన్షన్స్​ అక్కర్లేదని భరోసా

న్యూఢిల్లీ: తమ వ్యాపారాల్లో మరిన్నింటిని విడదీసి ప్రత్యేక ఎంటిటీలుగా మార్చుతామని అదానీ గ్రూప్‌‌ ప్రకటించింది. తమ సంస్థ అప్పులపై ఆందోళనలు అక్కర్లేదంది. 2028 నాటికి వ్యాపారాలను విడదీయం పూర్తవుతుందని గ్రూప్​ చీఫ్ ​ఫైనాన్షియల్​ ఆఫీసర్ జుగేశిందర్​ సింగ్​​ స్పష్టం చేశారు. మెటల్స్​, మైనింగ్​, డేటా సెంటర్​, ఎయిర్​పోర్ట్స్​, రోడ్స్​, లాజిస్టిక్స్​ బిజినెస్​లను వేరుచేస్తామని వెల్లడించారు. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, 2025–28  కల్లా  కొత్త  మేనేజ్​మెంట్​ను నియమిస్తామని చెప్పారు. అదానీ గ్రూప్​ ఎయిర్​పోర్ట్ ​బిజినెస్​పై ఎన్నో ఆశలను పెట్టుకుంది. ఇండియాలో అతిపెద్ద సర్వీస్ బేస్​గా ఎదిగే ప్రయత్నంలో ఉంది. గడిచిన ఐదేళ్లలో ఈ గ్రూపు తన పవర్​, కోల్​, ట్రాన్స్​మిషన్​, గ్రీన్​ఎనర్జీ బిజినెస్​లను విడదీసి ప్రత్యేక ఎంటిటీలుగా మార్చింది. ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న గౌతమ్​ అదానీకి పోర్టుల నుంచి ఎనర్జీ వరకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఇటీవలే  ఆయన ఎన్​డీటీవీని కూడా దక్కించుకున్నారు. గ్రూప్​ ఫ్లాగ్​షిప్​ కంపెనీ అదానీ ఎంటర్​ప్రైజెస్​ ఫాలో ఆన్ ఆఫర్​ ద్వారా 2.5 బిలియన్​ డాలర్లను సమీకరించనుంది. ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తాన్ని సేకరించగలమన్న నమ్మకం కుదిరాకే ఫాలో ఆన్​ ఆఫర్​ నిర్ణయం తీసుకున్నామని సింగ్​చెప్పారు. ఇష్యూ నుంచి వచ్చిన డబ్బును గ్రీన్​ హైడ్రోజన్​ ప్రాజెక్టులు, ఎయిర్​పోర్ట్​ ఫెసిలిటీలు, గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​వేస్​ కోసం వాడుతామని, మరికొంత మొత్తంతో అప్పులను తీర్చుతామని అన్నారు. సంస్థకు రూ.2.2 లక్షల కోట్ల అప్పులు ఉండటం ప్రమాదకరమంటూ ఎక్స్​పర్టులు చేసిన కామెంట్స్​ను సింగ్​ తోసిపుచ్చారు. తమ ఇన్వెస్టర్లలో ఎవరూ అప్పుల  గురించి  టెన్షన్ ​ పడటం లేదని అన్నారు. 

ట్రక్కు డ్రైవర్లతో రాజీ

ట్రక్కు చార్జీలపై ట్రాన్స్​పోర్ట్​ యూనియన్లతో విభేదాల కారణంగా హిమాచల్ ప్రదేశ్​లోని తమ రెండు సిమెంట్ ప్లాంట్లను మూసివేయడానికి దారి తీయడంపై అదానీ సిమెంట్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్పందించారు. ఈ సమస్య పరిష్కారం కోసం రవాణా సంఘాలతో చర్చించడానికి రెడీగా ఉన్నామంటూ అక్కడి అధికారులకు లేఖ రాశారు. రాబోయే మూడేళ్లలో దానితో కొత్త ట్రక్కులను మోహరించబోమని, ప్రస్తుతం ఉన్న 3,311 ట్రక్కుల సంఖ్యను 550 ట్రక్కులకు తగ్గిస్తామని కంపెనీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఒక్కో ట్రక్కు 25,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా, ఇక నుంచి 50,000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఒక్కో కిలోమీటరుకు నిర్ణీత ధరను తగ్గిస్తారు.  సరుకు రవాణా ఛార్జీల విషయంలో ట్రక్కు యూనియన్‌‌లతో వివాదం నేపథ్యంలో అదానీ గ్రూప్ గత నెలలో హిమాచల్ ప్రదేశ్​లోని బర్మానాలో గల ఏసీసీ సిమెంట్ ప్లాంట్‌‌ను, దార్లఘాట్‌‌లోని అంబుజా సిమెంట్ ఫెసిలిటీని మూసివేసింది. కిలోమీటరుకు యూనియన్లు రూ.11 చొప్పున ఇవ్వాలని అడుగుతుండగా, అదానీ గ్రూపు మాత్రం దీనిని రూ. ఆరుకు తగ్గించడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి.