చెరువుల పునరుజ్జీవం పేరిట నిధులు దుబారా

చెరువుల పునరుజ్జీవం పేరిట నిధులు దుబారా
  •  మంచిర్యాల రాముని చెరువు పనులు అస్తవ్యస్తం
  •  ఇప్పటికే ఉన్న రివిట్​మెంట్​తొలగించిన కాంట్రాక్టర్​  
  •  మళ్లీ కొత్తగా, పటిష్టంగా నిర్మిస్తామంటున్న అధికారులు 
  •  రెండేండ్ల క్రితమే రూ.కోటికిపైగా వెచ్చించిన ప్రభుత్వం
  •  బ్యూటిఫికేషన్​ పనులకు గ్రహణం.. ప్రజలకు కరువైన ఆహ్లాదం 

మంచిర్యాల, వెలుగు:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జలవనరుల పరిరక్షణ కోసం చెరువుల పునరుజ్జీవం పేరిట కోట్ల రూపాయలు విడుదల చేస్తుండగా.. అనాలోచిత నిర్ణయాలతో అధికారులు ఆ నిధులను దుబారా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువులో చేపడుతున్న పనులే ఇందుకు నిదర్శనం. అమృత్​2.0 స్కీమ్​కింద చెరువుల పునరుజ్జీవం కోసం జిల్లాలో మొత్తం ఏడు చెరువులను ఎంచుకున్నారు. రూ.16.70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రూ.1.98 కోట్లతో మంచిర్యాల రాముని చెరువు వద్ద చేపడుతున్న పనులను చూసిన జనం ‘ఇవేం పనులు’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. 

ఇదివరకే రూ.కోటికిపైగా ఖర్చురాముని చెరువు 

బ్యూటిఫికేషన్​లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో టీయూఎఫ్​ఐడీసీ నిధులు రూ.3.60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కాంట్రాక్టర్​కు సకాలంలో బిల్లులు రాకపోవడంతో వాటిని అర్ధాంతరంగా నిలిపివేశాడు. అప్పటికే రూ.కోటికి పైగా విలువైన పనులు చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా చెరువు కట్టను పటిష్టం చేయడానికి అవసరమైన చోట మట్టి పోయడంతో పాటు కట్ట పటిష్టంగా ఉండేలా రాళ్లతో రివిట్​మెంట్​పనులు చేపట్టారు. కొంతవరకు రెయిలింగ్ పనులు సైతం పూర్తయ్యాయి. ఈలోగా ప్రభుత్వం మారడంతో బ్యూటిఫికేషన్ పనులకు బ్రేక్​పడ్డది. అసంపూర్తి పనులతో ప్రజలు, వాకర్స్​ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

చేసిన పనులే మళ్లీ.. చెరువుల పునరుద్ధరణలో భాగంగా జిల్లాలోని మొత్తం ఏడు చెరువుల పనులను హైదరాబాద్​కు చెందిన కాంట్రాక్టర్​దక్కించుకున్నాడు. రాముని చెరువు అభివృద్ధి పనులకు మంజూరైన రూ.1.98 కోట్లతో చెరువు కట్టలను పటిష్టం​చేయడం, రెయిలింగ్​ఏర్పాటు, చెరువులో మురుగు నీరు కలవకుండా మళ్లించడం, తదితర పనులు చేయాలి. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు రెండు నెలల కిందటే పనులను లాంఛనంగా ప్రారంభించారు. అయితే బ్యూటిఫికేషన్​లో భాగంగా ఇప్పటికే చేపట్టిన రివిట్​మెంట్​రాళ్లను తాజాగా తొలగిస్తున్నారు.

చిల్ర్డన్స్​పార్కు వైపు చెరువు కట్టకు వేసిన రాళ్లను పూర్తిగా తొలగించారు. ఇదేమంటే చెరువు కట్టను మరింత పటిష్టం చేసి రివిట్​మెంట్​పనులు చేస్తామంటున్నారు. దీంతో ఇప్పటికే చేసిన పనులు వృథా అయ్యాయి. వాటికి వెచ్చించిన రూ.కోటికి పైగా నిధులు దుబారా అయినట్టే.  చెరువులో పేరుకుపోయిన మురుగు నీటిని, సిల్ట్​ను తొలగించి బోటింగ్​ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఏండ్లు గడుస్తున్నా తీరని కలగానే మిగిలిపోయింది.