సిబ్బంది ఇంటికొస్తలేరు.. సీడింగ్​ నడవట్లే: ​గందరగోళంగా​ ఫ్రీ వాటర్ స్కీమ్ 

సిబ్బంది ఇంటికొస్తలేరు.. సీడింగ్​ నడవట్లే: ​గందరగోళంగా​ ఫ్రీ వాటర్ స్కీమ్ 

3 నెల్లలో 2.90 లక్షల కనెక్షన్లకు ఆధార్​ లింకేజీ పూర్తి
మిగతా వాటికి మరో 4  నెలలు పట్టే అవకాశం

హైదరాబాద్, వెలుగు: సిటీలో ‘ఫ్రీ వాటర్ స్కీం’ పై జనాలను వాటర్ బోర్డు గందరగోళంలో పడేసింది. స్కీమ్​వర్తించాలంటే లబ్ధిదారుల ఆధార్ సీడింగ్​తప్పనిసరి చేసింది. మూడు నెలలుగా సీడింగ్ జరుగుతున్నా ప్రాసెస్ ముందుకు సాగట్లేదు. ఇంటి వద్దకే వచ్చి  ప్రాసెస్ పూర్తి చేస్తారని అధికారులు చెబుతున్నా, గ్రౌండ్ లెవెల్​లో  భిన్నంగా ఉంది. వాటర్​బోర్డు సెక్షన్ల పరిధిలో  సిబ్బంది ఇంటింటికీ వెళ్లకపోవడంతో సీడింగ్ ప్రాసెస్ వేగంగా  జరగట్లేదు. దీనికి తోడు మూడు నెలలుగా వాటర్ బిల్లులను నిలిపివేశారు. మరోవైపు ఆధార్ సీడింగ్ ప్రాసెస్ సులభంగా లేకపోవడంతో జనాలు ఆసక్తి చూపట్లేదు. 

వివరాలు సరిగా లేక..

ఫ్రీ వాటర్ స్కీమ్​ను అమలు చేస్తూ, ఆధార్ వివరాల నమోదు ప్రక్రియను ఈ ఏడాది జనవరి 12న వాటర్ బోర్డు మొదలుపెట్టింది. అప్పటి నుంచి నల్లా బిల్లులను దశలవారీగా నిలిపివేసింది. అదేవిధంగా కనెక్షన్ల దారులందరూ ఆధార్ సీడింగ్ చేసుకునేలా వాటర్ బోర్డు వెబ్​సైట్, మీ సేవ, మీటర్ రీడర్ల ద్వారా సౌలతు కల్పించింది. కానీ లింక్ చేసేందుకు నమోదు చేయాల్సిన వివరాలు స్పష్టంగా లేవు. క్యాన్ నంబర్ వివరాలు ఆధార్ కార్డుతో సరిపోక, సీడింగ్ జరగట్లేదు. ఇక వివరాలను సరి చేసేందుకు పలు రకాల డాక్యుమెంట్లను ఇవ్వాల్సి వస్తుండగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. 
తరచుగా టెక్నికల్ ప్రాబ్లమ్స్
మూడు నెలలుగా లైన్​మన్లు, మీటర్ రీడర్లతో కనెక్షన్లదారుల ఆధార్ వివరాలను వాటర్ బోర్డు సేకరిస్తోంది. వీరికి బయోమెట్రిక్ డివైజ్​లను ఇచ్చి ఇంటి వద్దనే వివరాలు నమోదు చేయాలని భావించినా, తరచుగా టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఆధార్ కార్డులోని వివరాలు, క్యాన్ నంబర్ వివరాలతో సరిపోక లింక్ కావట్లేదు.  కొన్నిచోట్ల ఆధార్ ఇచ్చేందుకు ఓనర్లు ఆసక్తి చూపట్లేదు. తొలుత బస్తీల్లోనే ప్రాసెస్ మొదలుపెట్టినా, ఇప్పటివరకు పూర్తి కాలేదు. దీంతో మరో నెల రోజులు గడువు పెంచినా ఆలోపు కూడా సీడింగ్ పూర్తవుతుందనే నమ్మకం లేదని వాటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 9.86 నల్లా కనెక్షన్లలో 2.90లక్షల నల్లాల ఆధార్ వివరాల లింకేజీ జరిగింది. మిగిలిన 7.26లక్షల నమోదుకు మరో 4  నెలల సమయం పట్టేలా అవకాశమున్నట్టు తెలుస్తోంది. 
మారని క్యాన్ వివరాలు
క్యాన్ నంబర్ ఎవరి పేరుతో ఉందో, వారి పేరుతోనే బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ క్యాన్ వివరాలను ఇప్పటి వరకు మార్చుకోలేని వారు కూడా ఎక్కువగానే ఉన్నారు.  మార్చుకునే ఫెసిలిటీని వాటర్ బోర్డు వెబ్ సైట్​లోనూ పొందుపర్చలేదు. ఛేంజ్ ఆఫ్ నేమ్ కోసం పలు డాక్యుమెంట్లను అందజేసినా ఎలాంటి ఫురోగతి లేదని తెలిసింది. సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, మ్యుటేషన్ కాపీ, ట్యాక్స్ రీసీట్ తోపాటు ఈసీ, వాటర్ బిల్లు, రూ. 20 అఫిడవిట్ వంటి కాపీలను స్థానిక సెక్షన్ ఆఫీసుల్లో ఇచ్చేందుకు తిరగాల్సి వస్తోందని జనాలు అంటున్నారు. ఇప్పటికే మ్యుటేషన్లు, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని ఆస్తులు రూ.లక్షల్లో ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నా, పీటీఐఎన్(ప్రాపర్టీ ట్యాక్స్ ఐడింటిఫికేషన్ నంబర్) ఉంటేనే ఆధార్ సీడింగ్ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో వాటర్ బోర్డు ఫ్రీ వాటర్ స్కీమ్​అయోమయంగా తయారైంది.  ఎప్పుడో ఓనర్ల పేరిట ఉన్న క్యాన్ వివరాలను మార్చుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆధార్ కార్డులోని వివరాలు, ఫోన్ నెంబర్ల మధ్య లింకు లేకపోవడంతోనూ సమస్యలు వస్తున్నాయి. స్కీమ్​ను ఆర్భాటంగా ప్రారంభించినా సరైన విధి విధానాలు లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు.

ఫ్లాట్ల వారీగా నల్లా బిల్లు జారీ చేస్తామని..
అపార్టుమెంట్​లో ఎవరైనా ఒకరి ఆధార్ వివరాలను నమోదు చేస్తే  సరిపోతుందని ముందుగా వాటర్​బోర్డు ప్రకటించింది. ఫ్లాట్ల వారీగా లెక్కించి నల్లా బిల్లు జారీ చేస్తామని కూడా అవగాహన కల్పించింది. ఇటీవల అపార్టుమెంట్​లోని ప్రతి ఫ్లాట్ ఓనర్ వివరాలు నమోదు చేస్తేనే ఫ్రీ వాటర్ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది.  దీంతో చాలా ఫ్లాట్లకు పీటీఐన్  లేకపోవడంతో సీడింగ్ అవడం లేదని సిబ్బంది అంటున్నారు.   పీటీఐఎన్ కావాలంటే జీహెచ్ఎంసీ ఆఫీసు చుట్టూ తిరగలేక, ఆధార్ సీడింగ్ ఎందుకని చాలామంది సీడింగ్​కు ఇంట్రెస్ట్​చూపడం లేదని తెలుస్తోంది.