
- ఏటా వాయిదా వేస్తున్న ఇంటర్ బోర్డు
- కార్పొరేట్ కాలేజీల ఒత్తిడే కారణం!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ జంబ్లింగ్‌పై ఈసారి కూడా సందిగ్ధత నెలకొంది. దీనిపై ఇంటర్ బోర్డు ఇప్పటికీ నోరు మెదపడం లేదు. వచ్చే ఏడాది నుంచి జంబ్లింగ్ అమలు చేస్తామని ప్రతి ఏటా చెబుతున్న ఆఫీసర్లు..ఈ ఏడాది కూడా పాత విధానాన్ని అమలు చేయనున్నట్లు కనిపిస్తున్నది. కార్పొరేట్ కాలేజీల ఒత్తిడితోనే ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో జంబ్లింగ్ విధానం అమలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టిందని, అందుకే తెలంగాణలో జంబ్లింగ్ అమలుపై దృష్టి సారించడం లేదని మరో వాదన.
జంబ్లింగ్ లేనట్లు ఇండికేషన్
వచ్చే ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని బోర్డు అధికారులు అకడమిక్ క్యాలెండర్ ప్రకటించారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు మ్యాథ్స్, సైన్స్, ఒకేషనల్ గ్రూపులకు చెందిన మూడున్నర లక్షల స్టూడెంట్లు అటెండ్ కానున్నారు. ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలను ఎవరి కాలేజీల్లో వారే నిర్వహించుకుంటున్నారు. అయితే, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ప్రాక్టికల్స్ పరీక్షల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు ఏండ్ల నుంచి వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని సర్కారు పెద్దలు, ఇంటర్ బోర్డు అధికారులు చెప్తూ వస్తున్నారు. కానీ.. ఆ నిర్ణయాన్ని ప్రతి ఏటా వాయిదా వేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం కూడా ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానం అమలు చేయడం లేదనే ఇండికేషన్ జిల్లా అధికారులకు ఇంటర్ బోర్డు ఇచ్చింది. దీంతో జనరల్ విధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహించేలా ఆఫీసర్లు చర్యలు మొదలుపెట్టారు.
పరికరాల పేర్లు కూడా తెలియట్లే..
కార్పొరేట్ కాలేజీలు తమ స్టూడెంట్లతో ప్రాక్టికల్స్ ప్రాక్టీస్ చేయించడం లేదని స్టూడెంట్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. వారికి కనీసం ప్రాక్టికల్స్ పరికరాలు, కెమికల్స్ పేర్లూ కూడా తెలియడం లేదని తెలిపాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్ కండక్ట్ చేసేందుకు వచ్చిన లెక్చరర్లను, సిబ్బందిని కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు మచ్చిక చేసుకుని ఎక్కువ మార్కులు వేయించుకుంటున్నాయని వివరించాయి.
దీనిపై తనిఖీలు చేయాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో మేనేజ్మెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. చాలా కార్పొరేట్ కాలేజీల్లో ప్రాక్టికల్ ల్యాబ్స్ కూడా లేవని ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులే చెప్తున్నారు.
ప్రాక్టికల్స్ సమయంలో పిల్లల నుంచే డబ్బులు వసూలు చేసి అధికారులకు ఇస్తున్నట్లు పేరెంట్స్ కు చెప్తుండటం గమనార్హం. అయినా, ఆయా కాలేజీలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జంబ్లింగ్ విధానం లేకపోవడంతో సర్కారు కాలేజీల స్టూడెంట్లకు నష్టం జరుగుతుందని వాదనలున్నాయి. కొత్త ప్రభుత్వమైనా ఇంటర్ ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో నిర్వహించాలని స్టూడెంట్ యూనియన్లు విజ్ఞప్తి చేస్తున్నాయి.