బీజేపీ లీడర్లు, క్యాడర్​లో అయోమయం

బీజేపీ లీడర్లు, క్యాడర్​లో అయోమయం

వరంగల్‍, వెలుగు: బీజేపీ స్టేట్‍చీఫ్‍ బండి సంజయ్‍ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నేపథ్యంలో అధికారుల వ్యవహారశైలి చర్చనీయాంశమవుతోంది. ఓవైపు హైకోర్టు పాదయాత్రకు, ఇటు వరంగల్​ సభకు పర్మిషన్​ ఇవ్వగా, మరోవైపు పోలీసులు మాత్రం ఓరుగల్లులో 30 సిటీ పోలీస్​యాక్ట్​ అమల్లో ఉంటుందని ప్రకటించడం వివాదాస్పదమవుతోంది.  రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో శనివారం పోలీస్ ​యాక్ట్​ ఎత్తివేస్తారా? లేక కొనసాగిస్తారా? అనే విషయాన్ని స్పష్టం చేయకపోవడంతో బీజేపీ లీడర్లు, క్యాడర్​లో అయోమయం నెలకొంది. ఏది ఏమైనా గ్రేటర్‍ వరంగల్‍ సిటీలో సంజయ్‍ పాదయాత్ర ముగింపు సభ నిర్వహించేందుకు బీజేపీ లీడర్లు రెడీ అవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.  

వివాదాస్పదంగా పోలీసుల తీరు..

బండి సంజయ్​ ప్రజాసంగ్రామ యాత్ర ఇప్పటికే రెండు దఫాలు వివిధ జిల్లాల్లో సాఫీగా సాగినప్పటికీ మూడోవిడత ఉమ్మడి వరంగల్​లో యాత్ర మొదలైనప్పటి నుంచి ముగింపు సభ దాకా పోలీసుల తీరు వివాదస్పదమవుతోంది. జనగామ జిల్లా దేవరుప్పులలో యాత్ర సందర్భంగా తగిన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో టీఆర్‍ఎస్‍, బీజేపీ మధ్య రాళ్ల దాడులు సాగాయి. సోమవారం స్టేషన్ ఘన్‍పూర్‍లోని పామునూర్‍ ఉప్పుగల్లు వద్ద దీక్ష సందర్భంగా పోలీసులు ఏకంగా బండి సంజయ్‍ను తమ వాహనాల్లో కరీంనగర్​ తరలించి హౌజ్‍అరెస్ట్​ చేశారు. పాదయాత్ర చేయడానికి వీళ్లేదంటూ వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్‍రావుతో బీజేపీ నేతలకు నోటీసులు ఇప్పించారు. దీంతో వారు హైకోర్ట్ ను ఆశ్రయించారు. పోలీసుల తీరును తప్పుపట్టిన కోర్టు పాదయాత్ర చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. శుక్రవారం ఉదయం మళ్లీ యాత్ర ప్రారంభించిన 
రెండు, మూడు గంటల్లోనే వరంగల్‍ పోలీస్​ కమిషనర్​ తరుణ్‍జోషి  అకస్మాత్తుగా మరో నిర్ణయం తీసుకున్నారు. వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో '30 సిటీ పోలీస్‍ యాక్ట్‍' అమలు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 31 ఉదయం 6 గంటల వరకు వరంగల్​ కమిషనరేట్‍పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్తర్వులు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

సభా స్థలిపైనా మాటమార్పు

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కోసం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని సెలక్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 23న బీజేపీ లీడర్లు  కాలేజీ ప్రిన్సిపాల్‍ నుంచి పర్మిషన్‍ తీసుకున్నారు. గ్రౌండ్‍ వాడుకునేందుకు అవసరమైన రూ.5 లక్షలు పేమెంట్‍ చేశారు. తీరా గురువారం సభ నిర్వహణకు స్థలం ఇవ్వలేమంటూ ప్రిన్సిపాల్‍ అయిలయ్య బీజేపీ లీడర్లకు లెటర్‍ రాశారు. సభకు పోలీసుల అనుమతి లేనందున తాము సైతం గ్రౌండ్‍ ఇవ్వలేమని.. లీడర్లు కట్టిన రూ.5 లక్షలు వెనక్కి ఇస్తామని చెప్పారు. దీంతో పార్టీ శ్రేణులు సభకు అనుమతి ఇవ్వాలంటూ మరోమారు హైకోర్టు గడప తొక్కాల్సి వచ్చింది. ఇదిలా నడస్తుండగా.

కాలేజీ అధికారులు శుక్రవారం ఉదయం మాట మార్చారు. తమ కళాశాలలో ఓ డిస్టెన్స్ యూనివర్సిటీ స్టూడెంట్లకు ఎగ్జామ్ సెంటర్‍ పడిందని,  అందువల్ల గ్రౌండ్‍ ఇవ్వడానికి నిరాకరించినట్లు మీడియాతో చెప్పారు. పాదయాత్ర, ముగింపు సభ నిర్వహణకు హైకోర్ట్ పర్మిషన్‍ ఇచ్చాక కూడా.. జిల్లా అధికారులు పలు ఆంక్షలు విధించడం గమనార్హం. ఈక్రమంలో కోర్టు  ఉత్తర్వులను గౌరవిస్తారా లేదంటే '30 సిటీ పోలీస్‍ యాక్ట్' 
పేరుతో సభను అడ్డుకుంటారా అనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. నిజానికి పాదయాత్ర ఆపాలంటూ నాలుగు రోజుల క్రితం అధికారిక ఉత్తర్వుల కాపీని రిలీజ్‍ చేసిన పోలీస్‍ అధికారులు ..'30 సిటీ పోలీస్‍ యాక్ట్'పై కేవలం పీఆర్వో ద్వారా మెసేజ్​తో సరిపెట్టడం గమనార్హం.