
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాకు లక్ష డాలర్ల అప్లికేషన్ ఫీజు వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన.. ఎమిరేట్స్ విమానంలో ఉన్న భారతీయులను కంగారు పెట్టింది. ఆ వార్త తెలిసిన తర్వాత ఫ్లైట్లో ఉన్న ఇండియన్లు ఆగమాగమయ్యారు. మళ్లీ అమెరికాకు వెళ్లాలంటే ఎక్కడ లక్ష డాలర్లు కట్టాల్సి వస్తుందో అన్న ఆందోళనతో వెంటనే ఉరుకులు పరుగులతో ఫ్లైట్ దిగారు. దీంతో విమానం ఆరోజు మూడు గంటలు ఆలస్యంగా నడిచింది.
శ్యాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఎమిరేట్స్ విమానంలో ఈ నెల 20న (భారతీయ కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. భారత్కు రావాల్సిన ఎమిరేట్స్ విమానం నుంచి ప్రయాణికులు కంగారుపడుతూ దిగుతున్న దృశ్యాలను ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఫ్లైట్ కెప్టెన్ స్పందిస్తున్న దృశ్యాలు మరో వీడియోలో కనిపించాయి. విమానం దిగాలనుకునే ప్రయాణికులు దిగవచ్చు అని కెప్టెన్ అంటున్న మాటలు ఆ వీడియోలో వినిపించాయి. ట్రంప్ ప్రకటనతో ఇండియన్లు ఎంత గాబరాపడ్డారో ఈ వీడియో చూస్తే తెలుస్తుందంటూ మరో ప్రయాణికుడు తెలిపాడు. ‘‘విమానంలో అంతా గందరగోళం నెలకొంది. ట్రంప్ చేసిన ప్రకటన ఇండియన్లను ఎంతగా భయపెట్టిందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది” అని మరో యూజర్ ఇన్ స్టాగ్రాంలో ఆ వీడియో పోస్టు చేశాడు.