మీ సేవల్లో గందరగోళం

మీ సేవల్లో గందరగోళం
  • మూడు వారాలుగా సర్వర్​లో సాంకేతిక ​సమస్య
  • సేవలు రిస్టోర్ చేసినా మళ్లీ అవాంతరాలు 
  • డేటా క్రాష్​.. మరోసారి డాక్యుమెంట్లు​సమర్పించాలంటున్న నిర్వాహకులు 
  • డేటా రిట్రీవ్  చేస్తున్నామంటున్న సాంకేతిక నిపుణులు 
  • ఆందోళనలో దరఖాస్తుదారులు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా మీ సేవల్లో గందరగోళం నెలకొంది. మూడు వారాలుగా సర్వర్లలో సాంకేతిక సమస్యలతో పౌరసేవలకు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు సర్వర్లలో సాంకేతిక సమస్యను అధిగమించి సేవలను పునరుద్ధరించినప్పటికీ.. ఎప్పుడు సర్వర్​ పనిచేస్తుందో,  ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ధృవీకరణ పత్రాల డౌన్​ లోడ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పురపాలక సేవలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. అంతేకాదు,  ‘మీ సేవ’లో  కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి దరఖాస్తు ఆమోదం పొందినట్లు  మెసేజ్​ వచ్చినా.. సర్వర్​లో  సమస్యతో సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ కావడం లేదు.

 దీంతో  తమ దరఖాస్తు ఆన్​లైన్​ లో ఉందో.. లేదో  తెలియక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్  మీసేవ స్టేట్  డేటా సెంటర్ (ఎస్​డీఎస్) లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో డేటా క్రాష్​ అయ్యిందన్న సమాచారంతో కొందరు మీ సేవ నిర్వాహకులు, దరఖాస్తుదారులు ఆందోళన చెందుతుండగా.. డేటాను రిట్రీవ్ ​ చేస్తున్నామని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,216 మీ సేవ కేంద్రాలు ఉండగా.. 38 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 204 రకాల సేవలు అందుతున్నాయి.

ఆ సేవలు పొందాలంటే తప్పనిసరిగా మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. విద్యా సంస్థల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, నీట్, మెడిసిన్, ఐసెట్​తో పాటు ఇతర ప్రొఫెషనల్​ కోర్సులకు ప్రవేశాలు పొందినవారు స్కాలర్​షిప్​ల కోసం కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల వద్ద ఉన్నత, ప్రొఫెషనల్​ కోర్సుల్లో ప్రవేశాల సమయంలో ఈ ధ్రువీకరణ పత్రాలు ఉండాల్సిందే. ఆన్​లైన్​లో ఆయా పత్రాల నంబర్లు నమోదు చేస్తే  ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్​మెంట్​కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్​ శాఖకు సంబంధించి ఈసీ పొందాలంటే  మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం తహసీల్దార్​ ఆఫీసులో మ్యానువల్​గా అందించే తొమ్మిది రకాల సర్టిఫికెట్లను మీసేవలో అందుబాటులోకి తెచ్చారు.  

ఆ అప్లికేషన్లు ఎక్కడ?.

మీ సేవల్లో  జులై 10 నుంచి ఈ నెల 12వ తేదీ మధ్యలో  చేసుకున్న దరఖాస్తులు సర్వర్  సమస్యతో కనిపించడం లేదు. దీంతో  కుల, ఆదాయ, నివాస తదిరత సర్టిఫికెట్లకు అప్లికేషన్​ పెట్టుకున్నవారు స్టేట్​ డేటా సెంటర్​ (ఎస్​డీఎస్) ​లో సాంకేతిక సమస్య తలెత్తిందని, మళ్లీ డ్యాకుమెంట్స్​ను తిరిగి అప్ లోడ్​ చేసి సబ్మిట్​ చేయాలని,  వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే తహసీల్దార్​ లాగిన్​కు డిస్పోసల్​ కోసం  వెళ్తాయని  మీ సేవ నిర్వాహకులు చెబుతున్నారు.  దాదాపు  3 లక్షలకు పైగా పెండింగ్  దరఖాస్తుల వివరాలు క్రాష్​  అయినట్లు తెలిసింది. దీంతో మళ్లీ అప్లికేషన్లు ​ సమర్పించాలని దరఖాస్తుదారులకు నిర్వాహుకులు ఫోన్​ చేస్తున్నారు. మళ్లీ డాక్యుమెంట్లు సమర్పిస్తే ఎలాంటి ఫీజు లేకుండా అప్లైయ్​ చేస్తామని చెబుతున్నారు.

అయినా..  దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవ కేంద్రాలు పట్టణ, నగరాల్లో ఎక్కువగా ఉండగా.. గ్రామీణ  ప్రాంతాల్లో తక్కువ ఉన్నారు. పైగా దరఖాస్తుదారులకు మీ సేవలో తలెత్తిన సాంకేతిక సమస్యపై అవగాహన లేదు. ఈ సమాచారం తెలియక వారు మళ్లీ  అప్లైయ్​  చేసుకునే అవకాశం లేదు.  అయితే, డేటా రిట్రీవ్  చేస్తున్నామని సాంకేతిక నిపుణులు చెబుతున్నా.. ఒకవేళ దరఖాస్తు ఆన్​లైన్​లో లేకపోతే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే, దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, డేటా రిట్రీవ్​ చేస్తున్నామని,  ఆన్​లైన్​లో కనిపించని దరఖాస్తులు ఏమైనా ఉంటే మళ్లీ అప్లైయ్​ చేసుకోవాలని మీ సేవ ఈడీఎంలు సూచిస్తున్నారు. కాగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీ-సేవ కేంద్రాలు దాదాపుగా మూడు వారాలుగా పనిచేయకపోవడం ఇదే తొలిసారి. గతంలో  మీ సేవలో అంతరాయం ఏర్పడినా..  24 గంటల నుంచి 48 గంటలలోపే సమస్యను పరిష్కరించేవారు. తొలిసారిగా 15 రోజులకు పైగా  సర్వర్​ డౌన్​ సమస్యతో ఇబ్బందులు పడ్డామని, ఆదాయం కోల్పోయామని మీ సేవ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.