NEET, EAPCET కౌన్సెలింగ్పై గందరగోళం.. నష్టపోతామంటున్న విద్యార్థులు !

NEET, EAPCET కౌన్సెలింగ్పై గందరగోళం..  నష్టపోతామంటున్న విద్యార్థులు !

అగ్రికల్చర్, వైద్య విద్య కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఒకేసారి NEET, EAPCET కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకదాని తర్వాత మరోటి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

వైద్య విద్యకు సంబంధించి ఇప్పటికే  నీట్ (NEET) కౌన్సిలింగ్ కొనసాగుతోంది. అంతలోనే మంగళవారం (ఆగస్టు 19) నుంచి ఎప్సెట్ (EAPCET) కౌన్సిలింగ ప్రారంభమవుతోంది. దీంతో రెండూ ఒకేసారి నిర్వహిస్తే ఎలా అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అగ్రి కోర్సుల్లో చేరిన తర్వాత వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ సీటు వస్తే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. 

ఎప్సెట్ ద్వారా  అగ్రికల్చర్ కోర్సులైన వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఎప్సెట్  కౌన్సెలింగ్ కోసం 11 వేల దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే నీట్ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఈ రెండు కోర్సులకు కలిసి మొత్తం 2500  మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు.

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎప్సెట్ తో పాటు నీట్ లోనూ సీట్ వచ్చే అవకాశం ఉంది. అయితే అగ్రి కోర్సుల్లో చేరిన తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్ లో సీట్లు వస్తే ఎలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీని వలన సీట్లు మిగిలిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. వేర్వేరు తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు.