గాజు గ్లాసుతో గందరగోళం.. 8 స్థానాలు మినహా ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు

గాజు గ్లాసుతో గందరగోళం.. 8 స్థానాలు మినహా ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు

బీజేపీ అభ్యర్థుల పరేషాన్

హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ గుర్తు గందరగోళాన్ని సృష్టిస్తోంది. గాజు గ్లాసు అనగానే గుర్తుకు వచ్చేది పవన్ కల్యాణ్ పార్టీ జనసేన. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో జనసేన కార్యక్రమాలు ఎక్కువగా లేవు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతోంది. జనసేన తరఫు నుంచి 8 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేశారు. మిగతా నియోజకవర్గాల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తోంది. అయితే, గాజు గ్లాసు గుర్తును ఎలక్షన కమిషన్‌‌ ఫ్రీ సింబల్‌‌ గా మార్చడంతో చాలా మంది ఇండిపెండెంట్లకు ఆ గుర్తు వచ్చింది. దీంతో జనసేన పోటీ చేయని మిగతా స్థానాల్లో గాజు గ్లాసుకు ఓట్లు పడితే తమ ఓటమికి దారి తీయొచ్చని బీజేపీ అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నందున పవన్ కల్యాణ్ అభిమానులు, ఆయన పార్టీ మద్దతుదారులు అన్ని చోట్లా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలో  పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు ఇది ఇబ్బందిగా మారుతోంది. దీంతో జనసేన మద్దతుతో బరిలోకి దిగుతున్న బీజేపీ అభ్యర్థులు, జనసేన కార్యకర్తలు ఓవైపు తమ కండువాలపై పవన్ కల్యాణ్ ఫోటో, మరోవైపు చేతిలో కమలం గుర్తు పట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు.  

ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు..   

అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేసేందుకు సాధారణ ప్రజలు సులభంగా గుర్తించే వస్తువులను గుర్తులుగా ఎన్నికల అధికారులు కేటాయించారు. వాటిలో జనసేన గుర్తు గాజు గ్లాసును కూడా కొందరికి కేటాయించారు. దీంతో జనసేన ఓట్లు ఇండిపెండెంట్లకు పడితే తమకు నష్టం జరుగుతుందని బీజేపీ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.