- కాంగ్రెస్, దళిత సంఘాల ఆందోళన
కోల్‌బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రొటోకాల్‌ను విస్మరించిన ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాల నాయకులు డిమాండ్‌చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మంత్రి క్యాంపు ఆఫీస్‌లో, నస్పూర్ ప్రెస్‌క్లబ్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో లీడర్లు మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించకుండా అధికార యంత్రాంగం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పుష్కరాలు, మంచిర్యాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలు, రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి స్థల పరిశీలనకు వచ్చిన సమయంలో, పార్లమెంట్ పరిధిలో ఇందిరమ్మ చీరల పంపిణిలో కూడా ఎంపీకి ప్రొటోకాల్ పాటించకుండా అవమానించారని మండిపడ్డారు. దళితుడనే కారణంతో అవమానిస్తున్నారా? అని ప్రశ్నించారు.
పెద్దపల్లి జిల్లాలో తమకంటే ఎక్కువ గుర్తింపు ఎంపీకి వస్తోందనే భయంతోనే కొందరు నేతలు కావాలని ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీకి పెద్దపల్లి పార్లమెంట్ లో జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామన్నారు. లీడర్లు సుదర్శన్, నర్సింగ్, ఎర్రరాజు, ఆర్.కిరణ్, ఎస్.హరికృష్ణ, టి.సురేశ్, తాజ్ బాబా, చిట్టి బాద్షా, అంజద్ ఖాన్, నల్ల రవి, తిరుపతి పాల్గొన్నారు.
