లోక్‌‌సభ పోరుకు కాంగ్రెస్ రెడీ

లోక్‌‌సభ పోరుకు కాంగ్రెస్ రెడీ

 

  • 17 నియోజకవర్గాలకు ఇన్‌‌చార్జ్‌‌లను నియమించిన కాంగ్రెస్​
  • రేవంత్, భట్టి, పొంగులేటికి రెండేసి నియోజకవర్గాల బాధ్యతలు
  • సంక్రాంతి తర్వాత అభ్యర్థుల లిస్ట్!​
  • ఎంపీ, ఎమ్మెల్సీ క్యాండిడేట్ల ఎంపిక హైకమాండ్ చేతుల్లోనే
  • నెలలోగా పలు నామినేటెడ్ పదవుల భర్తీ.. 
  • ఎమ్మెల్యే సీటు దక్కనోళ్లకు ప్రయారిటీ
  • సంక్రాంతి తర్వాత అభ్యర్థుల లిస్ట్!​

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమైతున్నది. ముందస్తు ఎన్నికలొస్తాయన్న చర్చల నేపథ్యంలో కసరత్తు షురూ చేసింది. ఈ క్రమంలోనే 17 నియోజకవర్గాలకు రాష్ట్ర మంత్రులను ఇన్‌‌చార్జ్‌‌లుగా పార్టీ నియమించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెండు చొప్పున నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. మిగతా చోట్ల ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఇన్‌‌చార్జ్‌‌లుగా నియమించారు. లోక్​సభకు ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశముందని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) మీటింగ్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించేలా చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు ఆయన సూచించినట్టు సమాచారం. సంక్రాంతి పండుగ అయిపోగానే అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తులు చేపట్టాలని సూచించినట్టు తెలుస్తున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినట్టుగా కాకుండా.. ముందుగానే క్యాండిడేట్ల జాబితాను ప్రకటించేందుకు కసరత్తులు చేయాలని అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులపైనా చర్చించినట్టు తెలుస్తున్నది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మొత్తాన్ని హైకమాండ్ నిర్ణయానికే వదిలేయాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

మూడు విడతల్లో పదవుల భర్తీ

లోక్​సభ ఎన్నికలకు ముందే పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని పీఏసీ మీటింగ్​లో నిర్ణయించినట్టు తెలిసింది. ముందుగా ఎమ్మెల్యే టికెట్ దక్కని వాళ్లు, సీటును త్యాగం చేసిన వాళ్లను ఆయా పదవుల్లో నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. నెలలోపే ఈ పదవులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. దాదాపు మూడు సార్లు నామినేటెడ్ పదవులను భర్తీ చేయవచ్చని పార్టీ నేతలు సమావేశంలో చర్చించినట్టు తెలుస్తున్నది. నామినేటెడ్ పదవులకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులకు అప్పగించినట్టు సమాచారం. ఈ ప్రక్రియను త్వరగా భర్తీ చేస్తే లోక్​సభ ఎన్నికల్లో ఆయా నేతలు ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది.