బీసీలకు 40 సీట్లు ఇయ్యాల్సిందే .. కాంగ్రెస్ ఓబీసీ లీడర్ల డిమాండ్

బీసీలకు 40 సీట్లు ఇయ్యాల్సిందే ..  కాంగ్రెస్ ఓబీసీ లీడర్ల డిమాండ్
  • ఠాక్రే, రేవంత్​ను కలిసి వినతిపత్రాలు
  • బీసీలపై ప్రేమ మాటల్లో కాదు.. చేతల్లో చూపాలన్న నేతలు  
  • సర్వే సాకులు చెప్పి ఇతర వర్గాలకు ఇస్తే పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరిక
  • ఇయ్యాల రాహుల్, ఖర్గేతో భేటీ కానున్న నేతలు  

హైదరాబాద్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీసీలకు కేటాయించాలని ఆ పార్టీ ఓబీసీ లీడర్లు డిమాండ్ చేశారు. 40 ఎమ్మెల్యే సీట్లతో పాటు 3 ఎంపీ సీట్లు కేటాయించాలని కోరుతూ పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంగళవారం వినతిపత్రాలు అందజేశారు. బీసీలపై మాటల్లో ప్రేమ కురిపిస్తే సరిపోదని, టికెట్లు కూడా ఇస్తేనే.. ఆ మాటలు నిజమని జనం నమ్ముతారని అన్నారు. ‘‘టికె ట్లు ఇవ్వకపోవడంతో కేసీఆర్‌‌పై బీసీలు ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్‌ కూడా అదే తప్పు చేయొద్దు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు టికెట్లు ఇస్తామన్న మాటను నిలుపుకుంటేనే, బీసీలకు కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతుంది. సర్వేలు, గెలుపు గుర్రాల పేరిట బీసీలను కాదని.. ఇతర వర్గాలకు టికెట్లు కేటాయిస్తే పార్టీకి ఓటమి తప్పదు” అని హెచ్చరించారు. టికెట్లు తీసుకున్న ఓసీలు అందరూ గెలుస్తున్నారా? అని కూడా ఠాక్రే, రేవంత్‌ను నాయకులు ప్రశ్నించినట్టు తెలిసింది. బీసీలకు ఓడిపోయే టికెట్లు ఇచ్చి.. ఓడిపోతున్నందునే టికెట్లు ఇవ్వడం లేదని ప్రచారం చేస్తే, ఇకపై సహించేదిలేదని కూడా హెచ్చరించినట్టు సమాచారం.

‘‘పార్టీకి నాయకత్వం వహిస్తున్నవాళ్లు బీసీ అభ్యర్థులు గెలిచేందుకు సహకరించకపోవడం బీసీల ఓటమికి కారణమవుతోంది. ఈసారి టికెట్ పొందిన బీసీల గెలు పునకు పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఆర్థికంగా బలహీనంగా ఉండి ప్రజల మద్దతు ఉన్న బీసీ లీడర్లను పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది” అని ఠాక్రే, రేవంత్ దృష్టికి ఓబీసీ లీడర్లు తీసుకెళ్లారు.

ఢిల్లీకి ఓబీసీ లీడర్లు.. 

టికెట్ల అంశంపై చర్చించేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ.. టీమ్ ఓబీసీ లీడర్లకు బుధవారం మధ్యాహ్నం అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో చెరుకు సుధాకర్‌‌, కత్తి వెంకటస్వామి తదితరులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పొన్నం ప్రభాకర్‌‌, మధుయాష్కీ తదితరులు బుధవారం ఉదయం వెళ్లనున్నారు. రేవంత్‌, ఠాక్రేకు వివరించిన అంశాలనే హైకమాండ్ కు చెప్పి.. టికెట్లు కోరుతామని బీసీ లీడర్లు పేర్కొన్నారు.