
- సమర్థులైన లీడర్ల కోసం రేపటి నుంచి అన్వేషణ
- కరీంనగర్‌కు ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు
- ఆరు రోజులపాటు ఉమ్మడి జిల్లాలో పర్యటన
- ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు డీసీసీలకు కొత్త సారథుల కోసం అన్వేషణ మొదలు కాబోతుంది. ఏఐసీసీ, పీసీసీ అబ్జర్వర్లు రేపటి నుంచి ఉమ్మడి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల మొదటి వారంలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో వాయిదా పడింది. అయితే బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించడం, ఎన్నికలకు బ్రేక్ పడడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీల బలోపేతంపై ఫోకస్ పెట్టింది.
డీసీసీ, సిటీ కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక ఏఐసీసీ అబ్జర్వర్, కొత్త జిల్లాకు పీసీసీ అబ్జర్వర్ ను నియమించింది. ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీనివాస్ మానే నేతృత్వంలో పీసీసీ పరిశీలకుల బృందం ఈ నెల 13న ఉమ్మడి జిల్లాకు రానుంది.
ప్రజలు, కార్యకర్తల్లో పేరున్న వాళ్లకే పదవులు..
డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా కేవలం పార్టీ కోసం పనిచేసే సమర్థులకే అవకాశం ఇవ్వాలని హైకమాండ్ అబ్జర్వర్లకు సూచించినట్లు తెలిసింది. ఇకనుంచి దేశ వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల అమలుపై జాతీయ నాయకత్వం డీసీసీ చీఫ్‌లతో నేరుగా మాట్లాడడంతో పాటు పలు విషయాలపై దిశా నిర్దేశం చేయనున్నందున డీసీసీ అధ్యక్షుల ఎంపిక పూర్తి పారదర్శకతతో నియమించాలని ఆదేశించింది. అందుకే ప్రజా మద్దతు ఉన్న నాయకుడిని గుర్తించి డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్న సంకల్పంతో వీరంతా పనిచేయనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి వారి సమర్థతను అంచనా వేయనున్నారు.
రేపటి నుంచి ఇక్కడే..
ఈనెల 13 నుంచి 18 తేదీ వరకు మొత్తం ఆరురోజులపాటు డీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటిస్తారు. సోమవారం కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ ఆలోచనలు వివరిస్తారు. అనంతరం డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. క్షేత్ర స్థాయిలో వచ్చిన ఫీడ్ బ్యాక్, అభ్యర్థుల సమర్థత ఆధారంగా దరఖాస్తుల వడపోత అనంతరం ముగ్గురి పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీ జనరల్‌సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు పంపిస్తారు. ఈ జాబితాను స్క్రూటినీ చేసి తిరిగి రాష్ట్రానికి పంపుతారు. అక్కడ దీపావళి నాటికి టీపీసీసీ చీఫ్, సీఎం, మంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు కలిసి కూర్చుని ప్రతీ జిల్లాలో ముగ్గురి పేర్లలో ఒకరిని డీసీసీ ప్రెసిడెంట్‌గా ఖరారు చేస్తారు.
జిల్లాలవారీగా పరిశీలకులు వీరే..
కరీంనగర్ కార్పొరేషన్‌కు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి-, కరీంనగర్ జిల్లాకు ఆత్రం సుగుణ(ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి)-, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చిట్ల సత్యనారాయణ -, జగిత్యాలకు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, రామగుండం కార్పొరేషన్‌కు ఎండీ ఖాజా ఫక్రుద్దీన్, పెద్దపల్లి జిల్లాకు కేతూరి వెంకటేశ్, గిరిజా షట్కర్.. డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పీసీసీ నుంచి అబ్జర్వర్లుగా వ్యవహరించబోతున్నారు.
పోటీ పడుతున్నది వీరే..!
కరీంనగర్ డీసీసీకి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌ఛార్జి వెలిచాల రాజేందర్‌రావు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి పోటీ పడుతున్నారు.
జగిత్యాల డీసీసీ అధ్యక్షునిగా గత రెండు టర్మ్ లుగా ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొనసాగుతున్నారు. కాగా డీసీసీ పీఠం కోసం జగిత్యాల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ బండ శంకర్, కోరుట్ల నియోజకవర్గం నుంచి జువ్వాడి కృష్ణారావు, సుజిత్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి అడ్లూరినే కొనసాగించే అవకాశం ఉందన్న ప్రచారం నడుస్తోంది.
పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు డీసీసీ రేసులో ఎవరున్నరో బహిర్గతం కాలేదు. హైకమాండ్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సిరిసిల్ల డీసీసీ పీఠంపై సీనియర్ల కన్ను
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల డీసీసీ పీఠంపై నలుగురు సీనియర్ లీడర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ కొనసాగుతున్నారు. కొత్త డీసీసీ అధ్యక్షులను నియమిస్తామని ఏఐసీసీ ప్రకటించడంతో సీనియర్ నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ జాబితాలో సిరిసిల్ల పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు సంగీతం శ్రీనివాస్, ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్, మరో సీనియర్ నేత గడ్డం నర్సయ్య, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కనిమెని చక్రదర్‌రెడ్డి ఉన్నారు.
వీరిలో సంగీతం శ్రీనివాస్ బీసీ పద్మశాలీ వర్గానికి చెందిన నేత. గడ్డం నర్సయ్య 1980 నుంచి పనిచేస్తున్నారు. దివంగత కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా), దివంగత మంత్రి శ్రీపాదరావులకు సుపరిచితుడు. ముస్తాబాద్ మండలానికి చెందిన కనిమెని చక్రదర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీలో చేరారు. ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షుడిగా ఉన్న బోయినిపల్లి మండానికి చెందిన కూస రవీందర్ డీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఆయన పదేండ్లుగా మిడ్ మానేరు ముంపు గ్రామాల పక్షాన కొట్లాడారు.