పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు
  • పకడ్బందీ ప్లాన్ లో అధికార కాంగ్రెస్
  • గత వైఫల్యాలే పాఠాలుగా బీజేపీ స్టెప్స్
  • అభ్యర్థులను ముందే ప్రకటించాలని అధిష్టానంపై ఒత్తిడి
  • తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ పోటీ?

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలకు కొత్త ఉత్సాహం ఇవ్వగా..బీఆర్ఎస్ ను డీలా చేశాయి. ఏది ఏమైనా మూడు పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలువడమే లక్ష్యంగా వ్యూహరచనలు మొదలు పెట్టాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను మూడు కాంగ్రెస్, నాలుగు బీజేపీ, తొమ్మిది బీఆర్ఎస్, ఒక  స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఈ సారి పది సీట్లకు తగ్గొద్దన్న లక్ష్యంతో మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 

హ్యాట్రిక్ లక్ష్యంగా బీజేపీ

రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. హ్యాట్రిక్ కోసం బీజేపీ ప్రయత్నాలను ప్రారంభించింది.  పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను గుణపాఠంగా తీసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ సారి ముందుగా టికెట్లు కేటాయించాలని కోరుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా ఓట్లశాతాన్ని పెంచుకున్నది. పలు చోట్ల బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. దాదాపు 30 లక్షల ఓట్లు పొందింది. దీంతోపాటు ఉత్తర తెలంగాణలో మరింత బలమైన పార్టీగా మారింది.  

అయితే ఆలస్యంగా టికెట్లు ఇవ్వడం, పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చడం తదితర కారణాలతో కేవంల 8 సీట్లు మాత్రమే గెలుచుకన్నామని, ఇకపై అలాంటి తప్పిదం జరగకుండా  చూడాలని పలువురు ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 28న రాష్ట్రానికి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ విషయాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు.  

ఆరు గ్యారెంటీలు అమలు తర్వాతే

అధికార కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారెంటీల అమలుపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిని పార్లమెంటు ఎన్నికల్లో అమలు చేసి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పార్లమెంటు ఎన్నికలకు వెళితే మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో పాగా వేయొచ్చనే భావనతో ఉన్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్ల శాతం కలిసొస్తుందనే భావనతో ఆ పార్టీ అధినాయకత్వం ఉంది. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీతో రాష్ట్రంలోని ఏదో ఒక పార్లమెంటు సెగ్మెంట్ నుంచి పోటీ చేయించి గెలిపించాలని ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం కూడా చేశారు.

దీటైన అభ్యర్థులను బరిలోకి దించడంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఎస్టాబ్లిష్ చేయడం, ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్లమెంటు ఎన్నికల వరకు ఇదే అటెన్షన్ ను మెయిన్ టెయిన్ చేయడం ద్వారా ఎక్కువ సీట్లు గెలువాలనే తలంపుతో ఉన్నది. 

తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ

తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ పోటీ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నది. ఇక్కడ ఓడిపోయామన్న సానుభూతి మహారాష్ట్రలో బాగా ఉందని అక్కడ కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో రాజకీయ కార్యకలాపాలు ప్రకటించిన బీఆర్ఎస్.. ఇప్పటికే  పలు చోట్ల భారీ బహిరంగ సభలు సైతం నిర్వహించింది. దాదాపు 20 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఉనికిని చాటుకుంది.

మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్  రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు తెలంగాణలో ఎప్పటిలాగే హైదరాబాద్ సీటును మిత్రపక్షమైన ఎంఐఎం కు వదిలేసి 16 చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నది. ఎంపీ టికెట్లను సిట్టింగులకే ఇస్తారా..? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకొని అభ్యర్థులను మార్చుతారా..? అన్నది ప్రస్తుతం హట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా మొత్తం 64 స్థానాల్లో బరిలోకి దిగబోతున్న గులాబీ పార్టీ ఎన్ని చోట్ల విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.