- ఆరోపణలకే పరిమితం.. అరెస్ట్ చేసే దమ్ము లేదా?: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునేందుకు ‘క్విడ్ ప్రో కో’ నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. ‘నువ్వు ఎంత తిన్నావు.. నేను ఎంత తిన్నాను? మీరే అంతా తినేశారు మాకేం మిగల్చలేదు’ అన్న చందంగా రెండు పార్టీల తీరు ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అవినీతి చిట్టా విప్పి, వంద రోజుల్లోనే బాధ్యులను జైలుకు పంపుతామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పటివరకు ఒక్కరినైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ మంత్రులు, వారి కుటుంబాల ఆస్తులపై మాట్లాడితే.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అవినీతిపై ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు.
సాగునీరు, కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వానాకాలంలో నష్టపోయిన రైతులకు యాసంగి సీజన్ ప్రారంభానికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎం ఫసల్ బీమా యోజనకు ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జీవో 190ను సక్రమంగా అమలు చేయడం లేదని, దీనిపై నిరసన తెలిపిన టీచర్లను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇదిలా ఉండగా.. టీవీ నటి, న్యాయవాది స్వర్ణలత, నటుడు లక్ష్మణ్, కెమెరామెన్లు సురేశ్, మహేశ్తదితరులు రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు.
