నకిరేకల్‌లో సీఎంకు చుక్కలు చూపిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నకిరేకల్‌లో సీఎంకు చుక్కలు చూపిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రామన్నపేట( నకిరేకల్), వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌‌కు చుక్కలు చూపించానని, ఈ సారి నకిరేకల్‌లోనూ చూపిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం రామన్నపేటలో నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌‌ఎస్‌ మండల అధ్యక్షుడు మందడి ఉదయ రెడ్డి, రామన్నపేట జడ్పీటీసీ పున్న లక్ష్మీ జగన్నాథం, నార్కట్ పల్లి సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకన్నతో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్‌లో వీరేశం భారీ మెజార్టీతో గెలువబోతున్నాడని, సీఎం కేసీఆర్ వస్తారో.. మంత్రులు జగదీశ్ రెడ్డి, కేటీఆర్ వస్తారో చూస్తామని సవాల్ చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమకు నమ్మకద్రోహం చేసి బీఆర్‌‌ఎస్‌కు అమ్ముడుపోయాడని ఆరోపించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక   చిల్లర ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. వీరేశం మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ అండతో ఎదిగిన చిరుమర్తి వారిపైనే ఆరోపణలు చేయడాన్ని కార్యకర్తలు జీర్జించుకోవడం లేదన్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.