బీఆర్‌‌ఎస్‌ మూడు ముక్కలైతది : రాజగోపాల్ రెడ్డి

బీఆర్‌‌ఎస్‌ మూడు ముక్కలైతది : రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్/మర్రిగూడ, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్  మూడు ముక్కలవుతుందని మునుగోడు కాంగ్రెస్  అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్  స్కామ్ లో సీఎం కేసీఆర్ బిడ్డ కవితను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్  చేయకపోతే ప్రజలందరూ కాంగ్రెస్  వైపు చూశారని అన్నారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించారు.

అలాగే మర్రిగూడ మండలం లెంకలపల్లి, భీమనపల్లి, కమ్మగూడెం, వట్టిపల్లి, రాంరెడ్డిపల్లి, సరంపేట గ్రామాల్లో ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు సోదరుల కాళ్లు పట్టుకొని తనను ఓడకొట్టిన తర్వాత కేసీఆర్  మళ్లీ వారిని మోసం చేశారని విమర్శించారు. మునుగోడులో బీఆర్ఎస్  దుకాణం బంద్  అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. బీఆర్ఎస్  పదేళ్ల పాలనలో పేదల బతుకులు మారలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ తుఫానులో కేసీఆర్  కుటుంబం కొట్టుకుపోవడం ఖాయమన్నారు.

తాను రాజీనామా చేయడం వల్లే చండూరు రెవెన్యూ డివిజన్  అయిందని, చౌటుప్పల్ లో వంద పడకల ఆస్పత్రి వచ్చిందని, చర్లగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వచ్చిందన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయడానికే తాను అప్పుడు బీజేపీలో చేరానని, కానీ తన ఉద్దేశం నెరవేరకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, కైలాష్ నేత, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమ తదితరులు పాల్గొన్నారు.