
మహబూబాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్అన్నారు. ఈనెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే పాల్గొనే సభకు కాంగ్రెస్ నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. బుధవారం మహబూబాబాద్వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మండపంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామచంద్రునాయక్మాట్లాడుతూ రాష్ట్రం విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ సారథ్యంలోని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. స్వలాభం కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను చేపట్టారని ఆరోపించారు. గతంలో ఏపీ ప్రభుత్వంతో జల ఒప్పందాలు కుదుర్చుకున్న అప్పటి బీఆర్ఎస్ సర్కారు నాయకులు, నేడు బనకచర్ల ప్రాజెక్టును ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే అభినందించకపోగా, నీటి రాజకీయాలను సెంటిమెంటును రెచ్చగొట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
గ్రామాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం కోసమే మల్లికార్జున ఖర్గే వస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. అనంతరం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అర్హులైన వారికి సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, పంట కొనుగోలు, సన్న వడ్లకు బోనస్, రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి ముందుకు సాగాలని కోరారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కసితో పనిచేస్తూ ప్రభుత్వ పాలనలో గ్రామస్థాయి నాయకులు భాగస్వాములు కావలసిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఫారెస్ట్ డెవలప్మెంట్సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శులు స్వర్ణకుమారి, నాగసీతారాములు, డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్ రెడ్డి, కేసముద్రం మార్కెట్‌కమిటీ చైర్మన్ గంటా సంజీవ రెడ్డి, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.