మంత్రి మల్లారెడ్డిపై ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్

మంత్రి మల్లారెడ్డిపై ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్

మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. కీసర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 9 జిల్లాల్లో కోడ్ అమల్లో ఉండగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశంసిస్తూ ప్రసంగించడంపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ అధికారులు గురువారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ ప్రారంభించారు. కాసేపటికి అక్కడే ఉన్న మంత్రి మల్లారెడ్డి స్టేజిపైకి ఎక్కి కేసీఆర్ను పొగుడుతూ స్పీచ్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని ఆర్డీఓ చెబుతున్నా పట్టించుకోకుండా ప్రసంగం కొనసాగించారు. అంతేకాదు.. కీసరలో జరుగుతున్నది జాతర అని దానికి ఎన్నికల నియమావళి వర్తించదని చెప్పారు. ఈ క్రమంలో మల్లారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. ఆయనపై ఈసీకి కంప్లైంట్ చేసింది. ప్రతి ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించడం మంత్రి మల్లారెడ్డికి పరిపాటిగా మారిందని అందుకే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ను కోరింది.